భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు…
అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు…
రూ.25 కోట్లతో రోడ్డు వెడల్పు, రూ.2.88 కోట్లతో ఆర్సీసీ పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు…
అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తున్న మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి చౌరస్తా నుండి బహదూర్ పల్లి చౌరస్తా వరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.25 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న 100 ఫీట్ల రోడ్డు వెడల్పు మరియు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం దూలపల్లిలో అపర్ణ పామ్ గ్రూవ్స్ సెప్టిక్ ట్యాంక్ నుండి దూలపల్లి కల్వర్టు అశోక అలా మైసన్ వరకు రూ.2.88 కోట్లతో చేపడుతున్న ఆర్సీసీ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు లేకుండా మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా ముందుచూపుతో పనిచేస్తున్నామని అన్నారు.
హెచ్ఎండిఏ ప్రతిపాదించిన 25 కోట్ల రూపాయల నిధులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వరద నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం కోసం సుమారు రూ.4 కోట్లతో త్వరలోనే దూలపల్లి కల్వర్టు పనిని ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. అపర్ణ పామ్ గ్రూవ్స్ లో సుమారు 10 కాలనీలు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, అందుకు శాశ్వత పరిష్కారంగా నేడు పనులను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని రెండు నెలల్లో పనులు పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నాం అని అన్నారు. ప్రజా అవసరాల మేరకు అభివృద్ధి పనుల నిమిత్తం ఎన్ని నిధులనైనా వెచ్చించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమిషనర్ శ్రీహరి, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్ మరియు స్థానిక కౌన్సిలర్లు, పాక్స్ చైర్మన్, డైరెక్టర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.