గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
బలహీన వర్గాలను అణిచివేసే కుట్ర సహించం
ప్రజా ప్రయోజనాల బిల్లులను వ్యతిరేకించడం మీకు సమంజసమా..
రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేయడం గవర్నర్ వ్యవస్థకే కళంకం
కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ లు అభ్యర్థిత్వలను తిరస్కరించడం బడుగులపై కక్ష సాధింపే
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తూ, ఫక్తు రాజకీయ నాయకురాలు వలె ప్రజాస్వామ్య యుద్దంగా ఎన్నికైన ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రజా ప్రయోజనాల బిల్లులను తిరస్కరిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళ సై అధికార బిజెపి పార్టీ ప్రతినిధిగా వ్యవహరించడం సిగ్గుచేటని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.
పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో బడుగు బలహీన వర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్ లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం నామినేట్ చేస్తే.. దురహంకారంతో బలహీన వర్గాలను అణిచివేయాలన్నా కుట్రతో వారి అభ్యర్థిత్వలను తిరస్కరించడం గవర్నర్ ఏకపక్ష నిర్ణయాలకు అద్దం పడుతోందని విమర్శించారు.
బిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారన్న కారణంతో అభ్యర్థిత్వలను తిరస్కరిస్తే ఒక రాజకీయ పార్టీకి ఉపాధ్యక్షురాలుగా పని చేసిన వ్యక్తి గవర్నర్గా నియమించడం సమంజసమా అని ప్రశ్నించారు.
తమిళిసై గవర్నర్‌లా కాకుండా బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. తమిళిసై మొదటి నుంచి తెలంగాణ ప్రగతికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆయన, ఇప్పటికే పలు కీలక బిల్లులు గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు. గవర్నర్ తమిళిసై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని రాజ్యసభకు ఎలా నామినేట్ చేశారో గవర్నర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సర్కారియా కమిషన్ ప్రకారం గవర్నర్ పదవిలో తమిళిసై ఉండకూడదని, ఇపుడు ఎలా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు.
బీజేపీ నేత గులాం అలీని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా ? మహేశ్ జఠ్మలానీ, సోనాల్ మాన్‌సింగ్, రాకేశ్ సిన్హా కమలం పార్టీలో పని చేయలేదా అని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక విధానం.. వారితో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానమా ? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. కేంద్రానికి ఒక నీతి, బీజేపీయేతర రాష్ట్రాలకు మరో నీతి ఉంటుందా ? తెలంగాణ విషయంలో గవర్నర్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, గవర్నర్ కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.
రాజకీయాలపై ఆసక్తి ఉంటే.. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి, సత్తా నిరూపించుకోవాలని సూచించారు.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ, ఒకసారి ఎమ్మెల్యేగా, కార్మిక నాయకుడిగా, ఇరుకుల సామాజిక వర్గం ప్రతినిధిగా, మెట్రో రైల్ సాధన సమితి అధ్యక్షుడిగా పనిచేసి బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధిగా పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తి అని కొనియాడారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో వివాదాలకు తావు లేకుండా, అవినీతికి తావివ్వకుండా పూర్తి పారదర్శకతతో పనిచేసిన నాయకుడు కుర్ర సత్యనారాయణ అని అన్నారు.
సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి నామినేట్ చేయడం జరిగిందని గుర్తు చేశారు.
వీటితో పాటు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా వెన్నవరం భూపాల్ రెడ్డి నీ నియమిస్తూ సీఎం కేసీఆర్ పంపించిన బిల్లును సైతం గవర్నర్ ఆమోదించకపోవడం ఆమె కక్షపూరిత చర్యలకు నిదర్శనం అన్నారు.
గవర్నర్ తమిళసై మరోమారు పునరాలోచించి అభ్యర్థిత్వలను ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.