పంట రుణాల వివరాలు ఇవ్వండి

Spread the love

బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కారు
రుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్ గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయం
క్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేకోవర్ చేసేలా ప్రణాళిక

హైదరాబాద్, : పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు? ఎంత మొత్తంలో తీసుకున్నారు?.. అనే వివరాలను ఇవ్వాలని సూచించింది. పంద్రాగస్టులోపు రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా పంట రుణాల వివరాలను స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సాయంతో బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంటున్నది. డిసెంబర్ 7ను కటాఫ్ తేదీగా పెట్టుకుని ఎన్ని పంట రుణాలు ఉన్నాయో లెక్క తేల్చాలని నిర్ణయించింది.

ఆర్బీఐ ఉన్నతాధికారులతో చర్చలు

రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. వీలైనంత వేగంగా రుణమాఫీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే అటు పంట రుణాల వివరాల సేకరణతో పాటు ఇటు ఏకకాలంలో మాఫీ చేసేందు కు ఏమేం మార్గాలు ఉన్నాయనే దానిపై ఆర్బీఐ ఉన్న తాధికారులు, ఆర్థిక నిపుణలతో చర్చలు జరుపుతున్నది. దాదాపు రూ.20 వేల కోట్ల నుంచి 23 వేల కోట్ల వరకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఈ మొత్తం మాఫీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఆ మేరకు నిధులు ఖజానాలో అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. దీంతో కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకుని బ్యాంకులకు చెల్లించాలనే ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. లేదా మాఫీ చేయాల్సిన క్రాప్ లోన్లు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే టేకోవర్ చేయాలని చూస్తున్నది. దీంతో మాఫీ వెంటనే పూర్తవుతుంది. టేకోవర్ చేసిన పంట రుణాలకు ఇన్స్టాల్మెంట్లలో ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. ఫలితంగా అటు రైతులకు ఏకకాలంలో మాఫీ జరగడంతో పాటు ప్రభుత్వానికి నిధుల వెలుసుబాటుకు అవకాశం దొరుకుతుంది.

జూన్లో గైడ్లైన్స్!

పంట రుణాల మాఫీకి సంబంధించి కటాఫ్ తేదీని కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు 2023 డిసెంబర్ 7ను తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కాదంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డిసెంబర్ 3ను తీసుకోవాలని అనుకుంటున్నది. ఇక పంట రుణాల వివరాలను ఎస్ఎల్బీసీ నుంచి తీసుకున్న తర్వాత జూన్లోనే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. జులై చివరి వారంలో మాఫీ ప్రక్రియను మొదలుపెట్టి.. ఆగస్టు 15వ తేదీ కల్లా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నది.

Related Posts

You cannot copy content of this page