SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 20 at 10.49.12 AM

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9000113667ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి: మేయర్‌

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను మేయర్ గద్వాల విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్‌ టీంలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు మేయర్‌ విజ్ఞప్తి చేశారు.

ఇవాళ, రేపు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం, షియర్‌ జోన్‌ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది.


SAKSHITHA NEWS