సాక్షితహైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు, వివిధ పార్టీల నేతలు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న పీవీ జ్ఞానభూమి వద్ద అంజలి ఘటించారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవితో పాటు ఇతర కుటుంబసభ్యులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నివాళులర్పించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని, సత్యవతి రాథోడ్, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు పీవీకి నివాళులర్పించారు. దేశానికి, తెలంగాణకు పీవీ నరసింహారావు అందించిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తుచేసుకున్నారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలి: తలసాని
మంత్రి తలసాని మాట్లాడుతూ పీవీ నరసింహారావు మారుమూల గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆయన వస్త్రధారణ ఉండేదని చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని.. ఈ విషయంలో భారాస పోరాడుతుందని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు పీవీ స్ఫూర్తిదాయకమని మరో మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పీవీ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనమిచ్చే నివాళి అని చెప్పారు.
ఆనాడే నిరంకుశత్వానికి వ్యతికేకంగా పీవీ నరసింహారావు పోరాడారని ఈటల రాజేందర్ చెప్పారు. ఆయన బహుభాషా కోవిదుడని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన బిడ్డ పీవీ అని ఈటల కొనియాడారు.