SAKSHITHA NEWS

సామాన్యులకూ “ఫ్యామిలీ డాక్టర్” వైద్యం

  • శిక్షణ ప్రారంభంలో తిరుపతి కలెక్టర్
    సాక్షిత, తిరుపతి బ్యూరో: డబ్బున్న గొప్పవాళ్ళు మాత్రమే డాక్టర్లను ఇంటికి పిలిపించి వైద్యం చేసుకుంటారనే అభిప్రాయం పోయేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టిన “ఫ్యామిలీ డాక్టర్” వైద్యంతో సామాన్యులకు కూడా ఇంటి వద్దే వైద్య సేవలు అందుతాయని తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక రుయా ఆసుపత్రి ఆవరణలో గల శ్రీ పద్మావతమ్మ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుపై ఎ.ఎన్.ఎం. లకు, ఎం.ఎల్.హెచ్.సి. లకు, ఐ.సి.డి.ఎస్. సూపర్వైజర్ లకు, సి.డి.పి.ఓ లకు ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ ప్రారంభంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. కలెక్టర్ మాట్లాడుతూ సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా “ఫ్యామిలీ డాక్టర్” వైద్యం గొప్ప కార్యక్రమమన్నారు. ఈ సేవల్లో వైద్య బృందం చిత్త శుద్ధి తో మనసా, వాచా, కర్మణా పనిచేస్తే సామాన్య ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. ఈ అవకాశం కేవలం వైద్య సేవలు అందించిన వైద్యుడికి, విద్యాభోధన చేసిన టీచర్లకు మాత్రమే ప్రజల హృదయాలను గెలుచుకునే అవకాశం ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థ మనకు ఉందని, 104 ద్వారా ఎ.ఎన్.ఎం. లు, డాక్టర్లు చికిత్సలు అందించనున్నారన్నారు. సచివాలయ పరిధిలో మధ్యాహ్నం వరకు ఓ.పి. సేవలు, మధ్యాహ్నం పైన సర్జరీలు చేసుకున్న వారికి పోస్ట్ చెకప్, వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో మీరందరూ కష్ట పడి పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చిన వారవుతారని అన్నారు. ఇందులో తిరుపతికి చెందిన టాటా క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యం కూడా సచివాలయ వ్యవస్థ సహకారం తీసుకొని మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నదని పేర్కొన్నారు. వారికి మన సహకారం అందించి మంచి వైద్య సేవలు సామాన్య ప్రజలకు అందేలా చూడాలని కోరారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులను మొదటి దశలోనే గుర్తిస్తే చిన్నపాటి వైద్యంతో నయం చేసుకోవచ్చన్నారు.
    ఈ శిక్షణా తరగతులలో స్టేట్ కో-ఆర్డినేటర్ రమా దేవి, డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ శ్రీహరి, అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ అరుణ సులోచనాదేవి, డిప్యుటీ డి.ఎం.హెచ్.ఓ లు సుధారాణి, హనుమంత రావు, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మల, డి.ఐ.ఓ. శాంత కుమారి, డి.పి.ఎం.ఓ. శ్రీనివాస రావు, ఎన్.సి.డి. కిరణ్ కుమార్ నాయక్, ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్ జయశ్రీ, జిల్లాలోని ఎ.ఎన్.ఎం లు, ఎం.ఎల్.హెచ్.సి.లు పాల్గొన్నారు.
    ……………..

SAKSHITHA NEWS