SAKSHITHA NEWS

సాయంత్రం గద్దె పైకి సారలమ్మ.. ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ ప్రారంభం

లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అనిఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజు ప్రతిరూపాలను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.

సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాల ప్రతిష్టాపనతో తొలిఘట్టం ముగుస్తుంది. ఈ కార్యక్రమమంతా పూర్తిగా ఆదివాసీ ఆచారాల ప్రకారమే జరుగుతుంది. 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు ఒకరోజు ముందే బయలుదేరారు.

అసలు ఘట్టం గురువారం సాయంత్రం ఆవిష్కృతం

పూర్తిగా కాలినడకన కాళ్లకు చెప్పుల్లేకుండా సాగే ఈ యాత్రలో ఏడు వాగులు, దట్టమైన అడవి మీదుగా ప్రయాణం ఉంటుంది. సరిగ్గా ఇవాళ సాయంత్రం సారలమ్మ గద్దె పైకి చేరుకుంటారు. అటు 40 కిలోమీటర్ల దూరంలోని కొండాయి నుంచి గోవిందరాజు ప్రతిరూపాలతో పూజారులు అదే సమయానికి గద్దెల దగ్గరకు చేరుకుంటారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ ప్రాంతమంతా సమ్మక్క సారక్క నామస్మరణతో మారుమోగిపోతుంది. ఇక జాతరలో అసలు ఘట్టం గురువారం సాయంత్రం ఆవిష్కృతమవుతుంది. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు.

ప్రత్యేక బస్సులు. .వేలమంది పోలీసులు

నాలుగు రోజుల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ, 6 వేల స్పెషల్‌ బస్సులను వేసింది. 14 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే ఈసారి స్పెషల్‌ ట్రైన్స్‌ కూడా ఏర్పాటుచేసింది. కాజీపేట లేదా వరంగల్‌లో రైలు దిగి బస్సుల ద్వారా మేడారం చేరుకునే విధంగా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇక సీఎం రేవంత్‌, గవర్నర్ తమిళి సై, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌…అమ్మవార్ల దర్శనానికి రానున్నారు.

ఈ జాతరను అన్నీ తానై తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు స్థానిక మంత్రి, ఆదివాసీ బిడ్డ సీతక్క. భావి తరాలకు తెలిసేందుకు, వెయ్యేళ్లు నిలిచేలా సమ్మక్క చరిత్రను శిలా శాసనం చేస్తామన్నారు

60 లక్షలమంది భక్తులు

ఇప్పటికే 60 లక్షలమంది వన దేవతలను దర్శించుకున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు మరో కోటిన్నరమంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ఇవాల్టి నుంచి ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణకు అవకాశం ఇస్తారు.

WhatsApp Image 2024 02 21 at 9.05.39 AM

SAKSHITHA NEWS