ఆకలి,అసమానతల నిర్మూలనే డాక్టర్ రావూరి భరద్వాజకు ఘనమైన నివాళి.
- వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ కు నిజమైన నివాళి అర్పించడం సమాజంలోని ఆకలి,అసమానతలను రూపుమాపటం ద్వారానే అని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.
ఈనెల 18వ తేదీన డాక్టర్ రావూరి భరద్వాజ సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరులోని అరండల్ పేటలో గల దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజ హాలులో డాక్టర్ రావూరి భరద్వాజ 9వ వర్ధంతి ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ డాక్టర్ రావూరి భరద్వాజ పేద కుటుంబంలో జన్మించి ఆకలి,అసమానతలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదిగి సాహిత్య లోకాన్ని సృష్టించినారన్నారు.కేవలం ఏడవ తరగతి చదివిన డాక్టర్ రావూరి భరద్వాజ స్వీయ పఠణతో
నిత్య విద్యార్థిగా మారి అనేక గ్రంథాలను రచించినారని,సినీ జీవితంలో ఉన్న మాయా ప్రపంచాన్ని,తెర వెనుక గాధలను ఎత్తిచూపుతూ రచించిన పాకుడు రాళ్లు నవల జ్ఞానపీఠ అవార్డును
అందించిందన్నారు.
బాల కార్మికుడిగా,జర్నలిస్టుగా,సినీ జర్నలిస్టుగా,సేల్స్ మ్యాన్ గా,హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా విభిన్న బాధ్యతలను నిర్వర్తిస్తూ జీవితాంతం సమాజ శ్రేయోభిలాషిగా కృషి చేసిన ప్రముఖ సాహిత్య వేత్త డాక్టర్ రావూరి భరద్వాజ అని కొనియాడారు.కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ ప్రసంగిస్తూ విశ్వనాథ సత్యనారాయణ,డాక్టర్ సి.నారాయణరెడ్డి తరువాత మూడవ వ్యక్తిగా అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు డాక్టర్ రావూరి భరద్వాజకు దక్కటం వారి సాహితీ సేవలకు నిదర్శనమన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, విజ్ఞాన్ యూనివర్సిటీ,జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ లు డాక్టర్ రావూరి భరద్వాజ సాహిత్య సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేశాయని,రెండుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను పొందినారని వివరించారు.రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ అంగులకుదిటి నాగవీరభద్రాచారి ప్రసంగిస్తూ పేదరికాన్ని అధిగమిస్తూ స్వయంకృషితో సాహితి లోకంలో అత్యున్నత స్థాయికి చేరిన డాక్టర్ రావూరి భరద్వాజ ను తెలుగు ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.డాక్టర్ రావూరి భరద్వాజ జీవితంలో వివిధ సందర్భాలలో సహకారాన్ని అందించిన వారి పేర్లను డాక్టర్ రావూరి భరద్వాజ తన బిడ్డలకు పెట్టడం వారి సంస్కారాన్ని,కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా టెలికం సలహా కమిటీ సభ్యులు నిమ్మరాజు చలపతిరావు, కడియాల సుబ్బారావు,పూసపాటి శంకరరావు,మేడిపి వెంకటప్రసాద్, శిద్దు చిరంజీవా,కందుకూరి లక్ష్మీనారాయణ,చామర్తి శంకర శాస్త్రి లతో పాటు రావూరి భరద్వాజ అభిమానులు పాల్గొన్నారు.కార్యక్రమ ప్రారంభంలో డాక్టర్ రావూరి భరద్వాజ చిత్రపటానికి అతిధులు పూల మాలలు వేసి,పుష్పాంజలితో శ్రద్ధాంజలి ఘటించారు.