SAKSHITHA NEWS

ED, CBI cases against us…a despicable political move: MLC Kavitha

మాపై ఈడి,సిబిఐ కేసులు…నీచమైన రాజకీయ ఎత్తుగడ్డ:ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐలు కేసులు పెట్టడం హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

దిల్లీ మద్యం కేసు రిమాండ్‌ రిపోర్టులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని నివాసం వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు.

‘‘దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతోంది. 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో భాజపా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నాం. మోదీ కంటే ముందు ఈడీ ఆయా రాష్ట్రాలకు వెళ్లడాన్ని చూస్తున్నాం.

వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఉన్నందున మోదీ కంటే ముందు ఈడీ ఇక్కడికి వచ్చింది. అది నార్మల్‌. నాపై కావొచ్చు.. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు హీనమైన ఎత్తుగడ. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి విచారణకైనా మేం సిద్ధం.

ఆయా ఏజెన్సీలు వచ్చి అడిగితే తప్పకుండా జవాబు ఇస్తాం. అంతేకానీ మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ పంథాని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనమేం చేస్తామో చెప్పుకొని గెలవాలి తప్ప.. ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న తెలంగాణలో మీకు అది సాధ్యపడదు. కాదు కూడదు అని జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. ఏమౌతుంది..

భయపడేదేముంది. ప్రజలు మా వెంట ఉన్నంతకాలం.. ప్రజల కోసం తెరాస చిత్తశుద్ధితో పనిచేస్తున్నంతకాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ రాదు’’ అని కవిత వ్యాఖ్యానించారు.


SAKSHITHA NEWS