SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సైనికుల స్పూర్తితో ఎంచుకున్న రంగంలో విశిష్ట సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని అమర్ జవాన్ స్మృతిచిహ్నం వద్ద కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధ విజయం మన దేశ సైన్యం యొక్క విజయం, శౌర్యం, కీర్తికి చిహ్నమని అన్నారు.

ప్రతికూల వాతావరణంలో మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ చేశారన్నారు. సైనిక సంక్షేమ భవన గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నట్లు, వచ్చే సంవత్సరం లోగా మొదటి ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేసుకొని, భవనాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. అమర్ జవాన్ స్మృతి చిహ్నం పూర్తి చేసుకున్నామన్నారు. అమర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి, పురోగతికి మనమంతా కృషి చేయాలన్నారు.

మనమంతా ఇక్కడ భద్రంగా, స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నామంటే, అది సరిహద్దుల్లో సైనికుల వల్లేనని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అమర సైనికుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, కల్నల్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఫ్రాన్సిస్, కార్యదర్శి యుగంధర్, అమర సైనికుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS