అర్హులకే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా
చిట్యాల సాక్షిత ప్రతినిధి
చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో అర్హులైన నిరుపేదల కే ఇండ్ల స్థలాలను ఇవ్వాలని అనర్హులకు ఇవ్వకూడదని
అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చిన్నకాపర్తి గ్రామంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలిమినేటి మాధవ రెడ్డి కృషితో పేద ప్రజలకు ఇండ్ల స్థలాలకు కొంత భూమిని అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిందని కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్థలాలను పేదలకు పంపిణీ చేయలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పంపిణీ చేయడం మంచి నిర్ణయమే కానీ అర్హులైన వారికి కాకుండా అనర్హులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చారని వాపోయారు. ఈ విషయంలో గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా ఈ లిస్ట్ తయారు చేశారని ఇందులో కొంతమంది ఆర్ధికంగా ఉన్నవారు, వ్యవసాయ భూములు కూడా ఉన్నవారు కూడా ఉన్నారని అన్నారు. అనర్హులను తొలగించి గ్రామసభ నిర్వహించి గ్రామ పంచాయతి పాలకవర్గాన్ని అన్ని పార్టీల నాయకులను, గ్రామ పెద్దలకు, ప్రజలకి అందరికి సమాచారం అందించి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుని గ్రామ ప్రజల సమక్షంలో అర్హులైన వారిని గుర్తించి ఇండ్ల స్థలాల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగాపురం భాస్కర్, కాంగ్రేస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బోయపల్లి వెంకన్న
ఉప సర్పంచ్ ఆవుల రమేష్,
టీఆర్ఎస్ అధ్యక్షులు ఆవుల సుందర్, సీపీఐ కార్యదర్శి కోనేటి రాములు, వార్డు సభ్యులు మామిడి నాగేష్, రూపని బిక్షం, వలిగొండ సత్యనారాయణ, అన్ని పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.