SAKSHITHA NEWS

విద్యతో మాత్రమే అభివృద్ధి సాధ్యం …..

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వర రావు

అన్ని వర్గాల వారు ఒకే చోట చదువుకునే దిశగా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణం

-ఖమ్మం నగరానికి నాలుగు దిక్కులా ఖబరస్థాన్ ల ఏర్పాటుకు చర్యలు

-షాదీఖానా అభివృద్ధికి మరో 50 లక్షలు మంజూరు

-మస్జిద్ ల రిపేర్ కొరకు లక్ష చొప్పున 63 మస్జిద్ లకు చెక్కులను అందజేసిన మంత్రి తుమ్మల

.
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత:

విద్యతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవు తుందని, మన పిల్లలకు తప్పనిసరిగా మంచి విద్య అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఖమ్మం ఉర్దూ షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఖమ్మం నియోజక వర్గంలో ఉన్న 63 మస్జిద్ లకు, మస్జిద్ ఒక్కటికి లక్ష చొప్పున రిపేర్ కొరకు మంజూరు చేసి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వరదలు, పార్లమెంట్ ఎన్నికల కారణంగా మసీదుల నిర్వహణ నిధులు ఆలస్యం జరిగిందని, పెద్దలు చెప్పినట్లుగా ఇక నుంచి ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ ముందుగానే మసీదుల నిర్వహణ నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సమయంలో ఇప్పుడున్న షాదీఖానా స్థలంలో ఫైర్ స్టేషన్ ఉండేదని, ముస్లీం సోదరులు షాదీఖానా అడిగితే ఇక్కడ ఏర్పాటు చేశామని అన్నారు. షాదీఖానా నిర్వహణ బాగా లేదని, షాదీఖానా నిర్వహణ కోసం మరో 50 లక్షలు మంజూరు చేస్తామని, కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి పకడ్బందీగా షాదీ ఖానాను తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఖమ్మం నగరం అన్ని వైపులా ఖబరస్థాన్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఖమ్మం నగరంలో ఉన్న హిందువులు, ముస్లిం, క్రిస్టియన్ మొదలగు అన్ని వర్గాల వారు అన్నదమ్ముళ్ల కలిసి ఉండే చరిత్ర ఉందని, దానిని కొనసాగించాలని మంత్రి తెలిపారు. మన రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలను చేర్పించి వారు చదువుకునే ఏర్పాట్లు చేయాలని, విద్యతోనే మన కుటుంబాలు బాగుపడతాయని, మనకు ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లల చదువు ఆపవద్దని అన్నారు. ప్రభుత్వం ఇటీవలే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాన్ని ప్రారంభించిందని, అన్ని కులాలు, వర్గాల వారు ఒకే చోట చదువు కునే ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 300 కోట్లు ఖర్చు చేసి అన్ని వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా కష్టపడే కలెక్టర్ మనకు ఉన్నారని, ముస్లిం కమ్యూనిటీకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లాలని, శక్తి మేరకు కలెక్టర్ పూర్తి చేస్తారని, కానీ పక్షంలో ప్రభుత్వం తరఫున ఆ పనులు పూర్తయ్యే విధంగా తాను చర్యలు తీసుకుంటానని అన్నారు. మంజూరైన షాదీఖానా నిర్మాణానికి అనువైన స్థలాన్ని పెద్దలందరూ కూర్చుని సూచించాలని, అందరికీ సౌకర్యం ఉండే విధంగా స్థలం చూపిస్తే అక్కడ షాదిఖానా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు. ముస్లిం కమ్యూనిటీ శాశ్వత అభివృద్ధి కోసం మనం పని చేయాలని, ఎటువంటి విభేదాలు మనకు వద్దని, పార్కింగ్ సౌకర్యం బాగా ఉండాలని అన్నారు.


కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మంత్రి సూచనల మేరకు నెలన్నర క్రితమే ఈ కార్యక్రమం జరగాలని, వరదలు, ఇతర సమస్యల కారణంగా కొంత ఆలస్యం జరిగిందని అన్నారు. 63 మసీదుల నిర్వహణ కోసం లక్ష రూపాయల చొప్పున నిధులను అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో వజూఖాన, కరెంట్, లైట్, ఫ్యాన్ వంటి సదుపాయాలు, నమాజ్ చదివే వారికి అవసరమైన పూర్తి సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. దీన్ తో పాటు దునియాపై కూడా దృష్టి పెట్టాలని, మసీదులు, షాది ఖానాలను ఎంత ఉత్సాహంతో కట్టుకుంటున్నామో అంతే ఉత్సాహంతో మన పిల్లల చదువులపై కూడా దృష్టి ఉంచాలని, ఎటువంటి తేడా లేకుండా పిల్లలను బాగా చదివించాలని కలెక్టర్ కోరారు. మంజూరైన షాదీ ఖానా పనులు చేసే విధంగా టెండర్లు పిలిచామని, వాటిని త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఖమ్మం కార్పొరేషన్ కు నలుదిక్కులా ఖబరస్థాన్ లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారని, ఆ సూచనల ప్రకారం 4 ఖబరస్థాన్ ల ఏర్పాటుకు స్థలం గుర్తించామని, నెల రోజుల వ్యవధిలో స్థలాలను అప్పగించడం జరుగుతుందని అన్నారు. ఈద్ గా కోసం ఒక స్థలం చూశామని, వచ్చే ఈద్ వరకు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి స్వయంగా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చారని అన్నారు. ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్న మంత్రి, మసీదులు సైతం అందంగా ఉండాలనే ఉద్దేశంతో వాటి మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఇంచార్జ్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, కార్పొరేటర్ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మస్జిద్ కమిటీ సభ్యులు, ముస్లింలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS