SAKSHITHA NEWS

తిరుపతిని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని,
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరుపతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికే కృషి చేస్తామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో భూమన అభినయ్ మాట్లాడుతూ తిరుపతికి రెండవ పైప్ లైన్ 40 కోట్ల వ్యయంతో నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్న టీటీడి పాలకమండలికి కృతజ్ఞతల తెలియజేసారు.

86 శాతం పూర్తయిన ఈ తాగునీటి పైప్ లైన్ వలన తిరుమలలో కూడా నీటి ఎద్దడిని తగ్గించవచ్చని, ఈ రెండో పైప్ లైన్ తో తిరుపతికి మరో 20 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కరకంబాడి నుండి తిరుచానూరుకు 80 అడుగుల రోడ్డు మార్గాన్ని వేయనున్నామన్నారు. తిరుపతి ప్రజల ఎన్నో ఏళ్ల కల అయినటువంటి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నామని, ఇందులో 5431 ఇళ్లకు పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో 7800 ఇళ్ల పట్టాలకు త్వరలో రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ప్రతిపక్ష నాయకులు మేము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని, గతంలో టీడీపీ నాయకులు నగర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, నగరాన్ని అభివృద్ధి చేయలేదని తెలిపారు.

తిరుపతి ప్రజల కష్టాలను తీర్చే నాయకుడిని ఎన్నుకోవాలి తప్ప స్వార్థ ప్రయోజనాలు, స్వలాభం చూసుకునే నాయకులు ఎందుకన్నారు. ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్న ఏకైక పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. జీవో నెం.232 ప్రకారం గత టీడీపీ హయాంలో పనులు చేయాల్సి ఉన్నా వారు చేయకుండా వదిలేశారన్నారు. ప్రజలకు ఇష్టం లేని పనులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చేయదని ఆయన స్పష్టం చేసారు.

తిరుపతి సర్వీస్ ప్రొవైడింగ్ గా ఉందని, రోజుకు లక్ష మంది వస్తున్నా తిరుపతిని సాధ్యమైనంత వరకు క్లీన్ సిటీగా ఉంచుతున్నామని, 1200 మంది ఉన్న శానిటరీ సిబ్బందిని మరో 1600 మందిని పెంచి 2800 లకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మ్యాన్ పవర్ పెంచేందుకు టీటీడీ సహాయ సహకారాలు కోరుతున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిని స్వచ్ఛ తిరుపతిగా ఉంచాలని, స్వచ్చ భారత్ నినాదాన్ని బీజేపీ పార్టీ తీసుకొచ్చిందని చెబుతూ ఇక్కడ తిరుపతిని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేస్తామంటే ఇక్కడి బీజేపీ నాయకులు అడ్డుకోవాలని చూడడం తగదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తిరుపతి అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేసారు.


SAKSHITHA NEWS