SAKSHITHA NEWS

మక్తల్‌: సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఆయన చుట్టి వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. చివరగా నారాయణపేట సభకు వెళ్లడానికి ముందు మక్తల్‌ సభలో మాట్లాడిన సీఎం ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు.

నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సీఎం మాట్లాడుతూ.. ‘సంగంబండ రిజర్వాయర్‌ బీమా ప్రాజెక్టు. ఇది ఏండ్ల కల. కాంగ్రెస్‌, తెలుగు దేశం రాజ్యాలల్ల ఈ ప్రాజెక్టును పట్టించుకోలె. తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నం. ఇప్పుడు సంగంబండ రిజర్వాయర్ నుంచి‌, భూత్పూర్‌ రిజర్వాయర్‌ నుంచి వస్తున్న నీళ్లతోనే మక్తల్‌, కృష్ణమండలం, మాగనూరు, నడువ, అమరచింత మండలాల్లో దాదాపు 2 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నయ్‌. మీరంతా సంతోషంగా ఉన్నరు. తెలంగాణలో అతి ఎక్కువ ఆయకట్టు ఉన్న నియోజకవర్గాలను లెక్కతీస్తే మక్తల్‌ కూడా నెంబర్‌ వన్‌గా ఉంటదని సంతోషంగా తెలియజేస్తున్నా. ఈ నీళ్లతోనే దాదాపు 150 చెరువులను నింపుకుంటున్నం. దాదాపు మక్తల్‌ పచ్చబడ్డది. నాకు సంతోషంగా ఉంది’ అన్నారు.

అదేవిధంగా నియోజకవర్గంలో జరుగాల్సిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ.. ‘మీ ఎమ్మెల్యే కొన్ని చిన్నచిన్న కోరికలు కోరిండు. మీ ఎమ్మెల్యే మాట జర కఠినంగా ఉంటది గానీ మనసు మాత్రం వెన్నలాంటిది. ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా పరుగెత్తుకుని వస్తడు. హైదరాబాద్‌కు వస్తే హైదరాబాద్‌ల ఆయన కారు ఆగదు. ఎంతదూరం ఉన్నా సరే, అర్థరాత్రి అయినా సరే మక్తల్‌కే చేరుకుంటడు గానీ, హైదరాబాద్‌లో ఉండే ఎమ్మెల్యే కాదు రామ్మోహన్‌రెడ్డి. వారి తండ్రి నర్సిరెడ్డి నాకు దగ్గరి మిత్రులు. ఆయన లాగే ఆయన బాటలోనే ఆయన కొడుకు కూడా ఇప్పుడు ప్రజా నాయకుడిగా మీ ముందు నిలబడ్డడు. నియోజకవర్గం కోసం ఆయన కోరిన కోరికలు అన్నీ నెరువేరుస్తా. నాతో కొట్లాడి చాలా చేయించాడు. వంద పడకల హాస్పిటల్‌ తెప్పించాడు. కాలేజీలు పెట్టించాడు. అనేక వసతులు కల్పించాడు. కాబట్టి రామ్మోహన్‌రెడ్డి ని మరోసారి బ్రహ్మాండంగా గెలిపించండి’ అని కోరారు.

‘మీరు కోరుతున్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ గానీ, ఇంకోటి గానీ గవర్నమెంట్‌ వచ్చిన నెల రోజులలోపే 100 శాతం చేయించే బాధ్యత నాది. మిగిలిన పనులన్నీ కూడా చేసుకుందాం. అందుకు ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు నేను నారాయణపేట పోవాలి. మీరందరూ పెద్ద మనసుతోటి పార్టీల చరిత్ర చూసి ఓటెయండి. ఏ పార్టీ ప్రజల కోసం ఏం చేసిందో ఆలోచించండి. వాళ్ల కాలంలో రూ.200 పెన్షన్‌ ఇస్తే ఇప్పుడు రూ.2000 ఇస్తున్నం. ఇక ముందు పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతున్నం. తెల్లకార్డు ఉన్న అందరికీ సన్న బియ్యం ఇస్తం. ఇంకా అనేక అంశాలు మ్యానిఫెస్టోలో చెప్పినం. పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్నీ మీకు విడమర్చి చెప్తరు. ఇప్పుడున్న జోష్‌నే మీరు 30 తారీఖు నాడు కూడా చూపించాలి. రామ్మోహన్‌రెడ్డి ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. గతం కంటే ఇంకో 10 వేల ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని మీ అందరిని కోరుతున్నా’ అని చెప్పి సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

Whatsapp Image 2023 11 06 At 6.46.05 Pm

SAKSHITHA NEWS