బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్‌తో ప్రతి కుటుంబానికి 8లక్షల నష్టం: చంద్రబాబు
బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతేంటి ? జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్మోహన్రెడ్డి అని మండిపడ్డారు. ఇప్పటి వరకు బటన్ నొక్కి జనంపై ఎంత భారం వేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. బటన్ నొక్కుతున్నానని గొప్పలు చెప్పుకొంటున్న జగన్, కరెంట్ ఛార్జీలు పెంచి రూ. 64 వేల కోట్ల భారం మోపాడని, జగన్ బటన్ నొక్కితేనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని, జగన్ బటన్ పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రం గెలవాలి
ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసమేనని, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో చూడలేదని, సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్ లేదని చెప్పారు. జగన్ బటన్ నొక్కుడుతో ప్రజలకు ఎంతో కష్టం వచ్చింది, ఒక్కో కుటుంబం రూ. 8 లక్షలు నష్టపోయిందని తెలిపారు. జగన్ జాబ్ క్యాలెండర్‌కు ఎందుకు బటన్ నొక్కలేదు? మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలేదు ? సీపీఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు ? అని ప్రశ్నించిన చంద్రబాబు, జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు. జగన్‌ది ఉత్తుత్తి బటన్ అని జనం గమనించాలని కోరారు.
జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం
వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు, ఎన్ని వారాలైంది ? రోడ్ల బాగు కోసం బటన్ ఎందుకు నొక్కలేదు ? రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు బటన్ ఎందుకు నొక్కలేదు, డీఎస్సీ కోసం ఇన్నాళ్లూ ఎందుకు బటన్ నొక్కలేదు ? అని చంద్రబాబు దుయ్యబట్టారు. మైనింగ్ బటన్ నొక్కి భూగర్భ సంపద దోచేశాడు, ఇసుక బటన్ నొక్కి తాడేపల్లికి సంపద తరలించాడు, జగన్ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయాయి, రేపు ప్రజలంతా ఒకే బటన్ నొక్కుతారు, ప్రజలు నొక్కే బటన్‌తో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం అని అన్నారు. ధనదాహంతో జగన్ ఉత్తరాంధ్రను ఊడ్చేశాడు, రుషికొండను అనకొండలా మింగేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు, సాక్షి పేపర్‌కు మాత్రం రూ.1000 కోట్లు కట్టబెట్టి, సలహాదారుల పేరిట వందల కోట్లు దోచిపెట్టారని, ఒక్క సజ్జలకే రూ.150 కోట్లు దోచి పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.
విశాఖలో రూ.40వేల కోట్ల దోపిడీ
విశాఖపట్నం పెట్టుబడులకు స్వర్గధామం అన్న చంద్రబాబు, విశాఖలో రూ.40వేల కోట్ల దోపిడీ జరిగిందని, తాను విశాఖకు తెచ్చిన కంపెనీలను జగన్ తరిమేశారని తెలిపారు. లూలూ కంపెనీని తరిమికొట్టి ఆ భూమి మింగేశారని వెల్లడించారు. విశాఖ ఉక్కుపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడరని, దోచుకోవడమే తప్ప జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమలేదని అన్నారు. గంజాయి అమ్ముతూ ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో దొరికిపోయారు, విశాఖను జగన్ గంజాయి కేంద్రంగా, నేర రాజధానిగా మార్చాడు.. అలాంటి వ్యక్తి మనకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఫ్యాన్ రెక్కలు విరిచేయాలి
ఎంపీ కుటుంబసభ్యులను కూడా కిడ్నాప్ చేసి డబ్బు అడిగారు, తహసీల్దార్ రమణయ్యను ఇంట్లోకి వచ్చి చంపేసి చక్కగా విమానంలో వెళ్లిపోయారు, అసలు ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పులివెందుల రౌడీలు విశాఖను కబ్జా చేస్తున్నారని, జగన్ బంధువు అనిల్‌రెడ్డి విశాఖలో కబ్జాలకు పాల్పడడంతో జగన్‌రెడ్డి మా ప్రాంతానికి రావొద్దని విశాఖ జనం అంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఐదేళ్లు రాజధాని లేకుండా చేసి జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోయారని, వైఎస్సార్సీపీ ఫ్యాన్ మూడు రెక్కలు విరిచేసి, మొండి ఫ్యాన్‌ను జగన్‌కు రిటర్న్ గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో విజయసాయి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి పెత్తనమేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను కూడా జగన్మోహన్రెడ్డి బాధితుడినేనన్న చంద్రబాబు, అయ్యన్నపాత్రుడిపై రేప్ కేసు, ఎస్సీ నేత అనితపై అట్రాసిటీ కేసు, ఎందరో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు.
ఇంట్లో ఎంతమంది ఉన్నా రూ.1500
తెలుగుదేశం అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనాలను చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామన్న చంద్రబాబు, 19 నుంచి 59 ఏళ్ల వయస్సు మహిళలకు నెలకు రూ.1500 అందిస్తామని చెప్పారు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అందరికీ రూ.1500 చొప్పున ఇస్తాం, ఆడబిడ్డలను చదివిస్తే ఇంట్లోని అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని స్పష్టం చేశారు.