మినీ ఇండోర్ స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలి – బిజెపి డిమాండ్

Spread the love

సాక్షిత – సిద్దిపేట బ్యూరో : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో వివిధ క్రీడలల్లో నైపుణ్యం కలిగిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ, అవార్డులు పొందిన క్రీడాకారులు హుస్నాబాద్ లో ఉన్నారన్నారు.

క్రీడాకారులకు ప్రాక్టీస్ చేయడానికి సరైన మైదానం లేక, రోడ్ల ప్రక్కన, చదును చేసిన స్థలాలలో మూతపడిన సినిమా థియేటర్లో, రైస్ మిల్లులో క్రీడలు ఆడుతున్న దౌర్భాగ్యమైన, దయనీయ పరిస్థితి పట్టణంలో నెలకొందన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు మినీ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి 9 ఏండ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు.

స్టేడియంలో పిచ్చి మొక్కలు పెరిగి అస్తవ్యస్తంగా తయారైందని గతంలో అప్పటి ఎమ్మెల్యే ప్రహారీ గోడ నిర్మించి గాలికొదిలేశారన్నారు. డిఎస్ఏ నిధులతో 2017 సంవత్సరంలో మిగులు పనులకు రూ. 87 లక్షలతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారన్నారు. రెండు రూములు నిర్మించి వై.ఎ.టి అండ్ సి నిధులతో 2018 సంవత్సరంలో రూ. కోటి రూపాయలతో మంత్రి తన్నీరు హరీష్ రావు మిగులు పనులకు శంకుస్థాపన చేశారు. వైఎటిసి నిధులతో ఈసంవత్సరంలో రూ. 2 కోట్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మినీ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియాన్ని ప్రారంభించిన ఏకైక ఎమ్మెల్యే సతీష్ బాబు అని తెలిపారు.

ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేసిన ఇంత వరకు క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురాపోవడం చూస్తే హుస్నాబాద్ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ కు క్రీడాకారుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు. 2017 నుంచి 23 వరకు మిగులు పనులకు రంగులు అద్దుతూ, రెండు సార్లు శంకుస్థాపనలు చేసి, అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియాన్ని ప్రారంభించిన ప్రపంచ మేధావి హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ బాబు ఒక్క ప్రాజెక్టుపై సరైన అవగాహన లేక, మిగులు పనులకు రెండు సార్లు శంకుస్థాపనలు చేయడం చూస్తే వారికి పాలన పట్ల ఎంతఅవగాహన ఉందో తెలుస్తుందన్నారు.

ఇంత నిర్లక్ష్యమైన కనీస అవగాహన లేని ఎమ్మెల్యే హుస్నాబాద్ ప్రాంతానికి ఉండడం మన దౌర్భాగ్యమని అన్నారు. వెంటనే మినీ స్టేడియాన్ని పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని బిజెపి హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో క్రీడాకారులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాము. వీరితో బిజెపి హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కోశాధికారి అకోజు అరుణ్ కుమార్ మండల కోశాధికారి ఇటిక్యాల కుమారస్వామి ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, బీజేవైయం పట్టణ అధికార ప్రతినిధి అశాడపు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page