SAKSHITHA NEWS

68వ రోజు కొనసాగిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

ఇల్లు పింఛన్లు కొలువులు రావడంలేదని మొరపెట్టుకున్న ప్రజలు

గొంగడి, గొర్రె బహుకరించి అభిమానం చాటుకున్న గొర్ల కాపరి

పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఎఐసిసి కార్యదర్శి సంపత్

పాదయాత్ర శిబిరం నుంచి ఎంపీ కోమటిరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భట్టి, సంపత్ తదితర కాంగ్రెస్ నేతలు

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు అడుగడుగునా జన నీరాజనం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 68వ రోజు మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, నవాబు పేట్ మండలం
రుక్కంపల్లి, చెన్రెడ్డిపల్లి, ఇప్పటూరు, మల్రెడ్డిపల్లి, కూచూరు, దొడ్డిపల్లి, కిష్టారం గ్రామాల్లో కొనసాగింది.
వడదెబ్బ వల్ల స్వల్ప ఆస్వస్థత గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఐదు రోజుల విరామం తర్వాత రుక్కంపల్లి గ్రామం నుంచి మంగళవారం తిరిగి తన పాదయాత్రను పునప్రారంభించారు. 68వ రోజు 12 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి నేరుగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చేరుకోగా గ్రామానికి చెందిన గూళ్ల బాలమని పాదయాత్రకి ఎదురు వచ్చి భట్టి విక్రమార్కుని కలిసి ఏడాది నుంచి తనకు పింఛన్ రావడంలేదని మండల కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన ఎవరూ పట్టించుకోవడంలేదని మొరపెట్టుకున్నది. తనకు భర్త లేడని ఉండటానికి ఇల్లు లేదని వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదని రెక్కల కష్టం తప్ప తమ తమకు ఏమీ ఆస్తులు లేవని తమకు సహాయం చేయాలని వేడుకుంది. తన బిడ్డ పెళ్లికి సాయం చేయించాలని కోరింది.
కాకర్జాల నీలమ్మ బట్టి విక్రమార్కను కలిసి తన భర్త పాముకాటు గురై చనిపోయి ఏడాది అవుతున్న వితంతు పెన్షన్ రావడంలేదని గోడు వెళ్లబోసుకుంది. తనకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని రెక్కల కష్టం తప్ప తమ తమకు ఎలాంటి ఆస్తులు లేవని ప్రభుత్వం నుంచి సాయం చేయించాలని వేడుకుంది. ఉండటానికి ఇల్లు లేకపోవడంతో గుడిసెలో బతుకుతున్నామని ఇల్లు ఇప్పించాలని కోరింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల పింఛన్ ఇస్తామని ఇచ్చారు.

నా ఆస్తి ఈ గుడిసెనే.. అంటూ భట్టికి మొరపెట్టుకున్న పెంటయ్య

చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చేరుకోగా గ్రామ శివారులో గొల్ల పెంటయ్య- లక్ష్మమ్మ దంపతులు పాదయాత్రకు ఎదురొచ్చి వాళ్లు నివసిస్తున్న పూరి గుడిసెలోకి భట్టి విక్రమార్కుని తీసుకువెళ్లారు. ప్లాస్టిక్ కవర్లతో వేసుకున్న కప్పు, కర్రలు పాతుకుని దానికి అడ్డం పెట్టుకున్న తడకలు చూయిస్తూ ఇదే మా సొంత ఆస్తి ఈ గుడిసేనే అంటూ…. ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాలుగా ఇంటి కోసం ఎమ్మెల్యే, గ్రామ సర్పంచును అడిగి విసిగి వేసారి పోయామని, ఇప్పటివరకు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు. వానకు తడిసి, ఎండకు ఎండి, చలికి వణుకుతూ, పాములు, తేళ్లతో సహజీవనం చేస్తున్నామని ఇంతటి దౌర్భాగ్య దుస్థితిలో బతుకుతున్న తమకు ఎవరు సాయం చేయడం లేదని తన గుడిసె చూపిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. పిల్లలు చదువుకున్నప్పటికీ కొలువులు రాలేదని, వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి వెంకటయ్యకు పింఛన్ రావడంలేదని మొరపెట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే మొట్టమొదలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇప్పిస్తానని, చదువుకున్న పిల్లలకు కొలువులు ఇందిరమ్మ రాజ్యంలోనే వస్తాయని ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ను గెలిపించుకోవాలన్నారు.

పాదయాత్ర ఇప్పటూరు గ్రామానికి చేరుకోగా కావలి హన్మమ్మ ఎదురొచ్చి భట్టి విక్రమార్క కు దండం పెడుతూ పదేళ్ల నుంచి ఇల్లు రావడం లేదని చదువుకున్న పిల్లలకు కొలువులు లేవని గోడు వెళ్ళబోసుకున్నది. ఈ గవర్నమెంట్ బాగాలేదని మళ్లీ ఇందిరమ్మ రాజ్యమే రావాలని, అప్పుడే మా పిల్లలు మంచి బతుకుతారని వాపోయింది. సార్ మీరు గట్టిగా తిరగండి ఇందిరమ్మ రాజ్యం తీసుకురండి మీ వెంట మేము ఉంటామని చెబుతూ భట్టి విక్రమార్కతో కలిసి పాదయాత్రలో కదం తొక్కింది‌.

ఇందిరమ్మ ఇచ్చిన భూమి దున్నుకొని బతుకుతున్నాం

మల్లారెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను కలిసిన కావలి పెంటమ్మ, బ్యాగరీ ఎల్లమ్మ, యాదయ్య రంగయ్య లక్ష్మమ్మ వెంకటేశం కనగాల నరసింహ తదితరులు తమకు ఇల్లు లేవని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్న ఎవరు పట్టించుకోవడంలేదని, ఏడాది నుంచి పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న రాలేదని బుర్ర బుచ్చమ్మ యాదమ్మ అంజమ్మలు భట్టి విక్రమార్కకు మొరపెట్టుకున్నారు. ఇందిరమ్మ ఇచ్చిన భూమిలోనే దున్నుకొని బతుకుతున్నామని ఈ గవర్నమెంట్ మూడెకరాలు ఇస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్న ఇప్పటికి ఒకరికి ఎకరం ఇవ్వలేదని బుర్ర యాదమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. భూములు ఇప్పించాలని , చదువుకున్న తమ పిల్లలకు కొలువులు వచ్చేలా చూడాలని కోరారు.

ధాన్యం కొంటలేరు

ఇప్పటూరు గ్రామానికి చేరుకున్న సందర్భంగా ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పల వద్ద నిరీక్షించిన రైతులు భట్టి విక్రమార్కను కలిసి ధాన్యం తీసుకొచ్చి పది రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు బేస్తరాములు మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు కల్లాల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేశారని బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోయారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి పది రోజులు అవుతున్న ఎవరు కొనడం లేదని, అకాల వర్షాలకు ధాన్యం తడవడం తాము ఆరబెట్టడం ఇదే జరుగుతుందని చెప్పుకొచ్చారు. అధికారులతో మాట్లాడి తమ ధాన్యం కొనుగోలు చేయించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా చూస్తానని భట్టి వారికి హామీ ఇచ్చారు‌.

ఇల్లు ఇప్పించండి సారూ…

ఇప్పటూరు గ్రామాంలో కిరాయి పెంకుటింట్లో నివాసం చేస్తున్న ముష్టి రామేశ్వరి భట్టి విక్రమార్కుని కలిసి తన ఇంట్లోకి తీసుకువెళ్లింది. రోడ్డుకు మీటర్ కిందికి ఉన్న ఇంట్లోకి తలవంచుకొని వెళ్లిన భట్టి చిల్లుల పడి ఉన్న పైకప్పును చూశారు. రెక్కల కష్టం మీదనే బిడ్డ పెళ్లి చేశామని, కొడుకును ఇంటర్ చదివించిన కొలువు రాకపోవడంతో ఊర్లో కూలి పనికి వెళుతున్నాడని, తమకు ఎలాంటి ఆసరాలేదని, ఆస్తిపాస్తులు లేవని చెప్పారు. నెలకు 1500 కిరాయి చెల్లిస్తూ ఈ చిల్లులు పడిన పెంకుటింట్లోనే బతుకుతున్నామని, తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, బతకడానికి ఇంత భూమి ఇవ్వాలని వేడుకున్నారు. నాలుగు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని ఇంటి స్థలం కూడా ఇస్తామని భట్టి వారికి హామీ ఇచ్చారు.

సిలిండర్ ధర పెంచుతూ పోతే.. ఎం తినాలి? ఎట్లా బతుకాలి?

ఇప్పటూరు గ్రామానికి చెందిన ఎం.డి జాఫర్ ఇంట్లో ఉన్న ఖాళీ గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 400లకు ఇస్తే.. ఇప్పుడున్న ప్రభుత్వాలు 1300 రూపాయలకు పెంచాయి. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు ఆకాశానికి అంటుతున్నాయి. ఏం తినాలి? ఎట్లా బతకాలి? ఈ పాలనొద్దు. ఇందిరమ్మ రాజ్యం తీసుకురండి. కర్ణాటకలో 450 రూపాయలకి ఇస్తున్న సిలిండర్ ను ఇక్కడ కూడా ఇప్పించండి అని వేడుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇప్పిస్తామని భట్టి విక్రమార్క వారికి హామీ ఇచ్చారు.

గొంగడి, గొర్రె బహుకరించి అభిమానం చాటుకున్న గొర్ల కాపరి

మల్లారెడ్డిపల్లి గ్రామానికి చేరుకోగా గ్రామ శివారులో ఉన్న గొర్ల కాపరి చెన్నూరి జంగయ్య భట్టి విక్రమార్కను చూసి అభిమానంతో పరిగెత్తుకొని వచ్చి తన మెడలో ఉన్న గొంగడిని తీసి భట్టి విక్రమార్కకు వేసి అభిమానం చాటుకున్నారు. గొర్రె పిల్లను బహుకరించారు.

భట్టి పాదయాత్రకు ఘన స్వాగతం

సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు పలు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర తిలకం దిద్ది స్వాగతించారు. గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అభివాదం చేస్తూ భట్టి విక్రమార్క తన పాదయాత్రను ముందుకు కొనసాగించారు.

ఎంపీ కోమటిరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

నవాబుపేట మండలం మల్లారెడ్డి పల్లి గ్రామంలో పాదయాత్ర లంచ్ బ్రేక్ సందర్భంగా విశ్రాంతి సమయంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వీడియో కాల్ చేసి భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు‌. పాదయాత్ర శిభిరం నుంచి ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న పాట పాడుతూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. లాంగ్ లివ్ వెంకన్న అంటూ కళాకారులు నినాదాలు చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

సంపత్ సంఘీభావం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం ఇప్పటూరు గ్రామ శివారులో ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. భట్టి విక్రమార్కతో కలిసి పాదయాత్రలో అడుగులో.. అడుగులు వేస్తూ కధం తొక్కారు.


SAKSHITHA NEWS