అందరికీ మెరుగైన వైద్యం.. అదే జగనన్న నినాదం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అమరావతిలో జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్ ప్రారంభం
పేద, ధనిక తేడా లేకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. అమరావతిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. డాక్టర్లను, సిబ్బందిని పలకరించి.. వైద్య పరీక్షలతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయ పరిధిలో హెల్త్ క్యాంపులు నిర్వహించి స్పెషలిస్టు డాక్టర్లతో వైద్యపరీక్షలు, అవసరమైన మందులు ఉచితంగగా అందజేస్తున్నారన్నారు. 66 రకాల వైద్యపరీక్షలతో పాటు 108 రకాల మందులు కూడా ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అమరావతి, అత్తలూరు గ్రామాల్లో ప్రభుత్వాస్పత్రులు జగనన్న పాలనలో మెుగుపడ్డాయని చెప్పారు. ఆరుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్ తో పాటు వివిధ రంగాల్లో నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. గత ప్రభుత్వాలు ఆస్పత్రులను, పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదన్నారు. కానీ జగనన్న పాలనలో ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు ఏర్పాటుచేసి ఇంటి ముందుకే వైద్యసేవలు తెచ్చారన్నారు. దేశంలోనే ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదన్నారు. హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో నయం కాని వ్యాధుల కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రిని కూడా అభివృద్ధి చేశామన్నారు. క్యాన్సర్ వ్యాధికి కూడా అక్కడ ఉచితంగా చికిత్స లభిస్తోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం కోసం ఖర్చు పెట్టలేని పేదల కోసమే ప్రభుత్వాస్పత్రులు ఆధునీకరించామన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని మించిన వైద్య సేవలు ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.