ఇప్పటికే అక్రమ భూదందా కేసులో అరెస్టు అయిన మాజీ సీఎం కేసీఆర్ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది… సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరించి, గెస్ట్‌హౌస్‌లో నిర్భంధించి నగదు, బంగారం దోచుకున్నారు. అతడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కన్నారావు సహా మరో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కన్నారావు నందిని అనే మహిళతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ సమస్య పరిష్కారం కోసం తనకు న్యాయం చేయాలని విజయవర్ధన్ రావు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నారావు దగ్గరకు వెళ్లాడు. కన్నారావుకు నందిని అనే మహిళతో పరిచయం ఉంది. అలాగే విజయవర్ధన్‌కు నందిని స్నేహితురాలు. అతని వద్ద భారీ మొత్తంలో డబ్బు, నగలు ఉన్నట్లు తెలుసుకున్న ఆమె ఎలాగైనా వాటిని కొట్టేయాలని భావించింది. ఓ సమస్య విషయంలో విజయవర్ధన్ కన్నారావు వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన నందిని, కన్నారావు సాయంతో ఆ ఉద్యోగి వద్ద ఉన్న నగదు, బంగారం లాక్కోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ విషయం కన్నారావుకు తెలిపింది.
అలా ఓ రోజు విజయవర్దన్ ను గెస్ట్‌హౌస్‌కు పిలిపించుకున్న ఆ మహిళ, కన్నారావు సహా మరికొంత మందితో కలిసి అతడిని బెదిరించారు. అతడి వద్ద ఉన్న రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. తన సొమ్ము కోల్పోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసునని బెదిరించినట్లు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.