SAKSHITHA NEWS

Andhra University-Telugu Department Celebrations of Public Poet Vemana Jayanti

ఆంధ్రవిశ్వవిద్యాలయం-తెలుగు విభాగంలో ప్రజాకవి వేమన జయంతి వేడుకలు

         ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ప్రజాకవి *జయంతి వేడుకలు* ఘనంగా నిర్వహంచబడ్డాయి.తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  ముందుగా వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం వేమన జయంతిని అధికారకంగా ప్రకటించటమే కాక జయంతి ఉత్సవాలను అన్ని చోట్ల జరపాలని ప్రభుత్వం నిర్ణయించటం  తెలుగు భాషా,సాహిత్యాభిమానుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ముఖ్యఅతిథిగా హాజరైన డా యల్ బి కళాశాల తెలుగు విశ్రాంతాచార్యులు డా మరడాన సుబ్బారావు మాట్లాడుతూ వేమన దేశియ కవిత్వంలో కవిత్వం అల్లి  లోకరీతిని,నీతినీ తెలియజేసి ప్రజల జీవనాడిని తెలిపిన లోకకవి అన్నారు.ప్రజలలో నిరంతరం తిరుగుతూ సమస్త విషయాలపట్ల స్పృహాను పెంచుకొని సమాజంలోని లొసుగులను స్వార్ధపూరిత ప్రజాజీవన విధానాన్ని ఎండగడుతూ చక్కని చిక్కని అలతిఅలతి పదాలతో పద్యాలల్లి సమాజ చైతన్యానికి ,సంఘసంస్కరణ దృక్పధానికి నాంది పలికారన్నారు.

సమాజంలో కుటుంబ సంబంధ భాందవ్యాలను ఎంతో పరిశీలన చేసిన వ్యక్తి అని  వ్యక్తుల మానసిక చిత్తవృత్తిని అన్ని విధాల అవపోసన పట్టి వారి వ్యక్తిత్వాలను మార్చుకొవలసిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించిన మానసిక తత్త్వవేత్త వేమన అనికొనియాడారు.ఆయన పద్యాలలో సూక్తులు దీపశక్తులుగా నిలిచి వెలుగులందించాయన్నారు.వేమనకు సహాజంగా కవిత్వం అబ్బటంచేత యతి ప్రాసలు వాటంతటవే సందర్భోచితంగా వచ్చి ఆయా స్ధానాలలో పొందికగా చేరాయన్నారు.

మనిషి తనకు తోడుగా ఉన్నాడనుకోవటం బలం. ఆ బలాన్ని భగవంతుడుగా భావిస్తూ మనిషి జీవించాడని అయితే కొంతమంది స్వార్ధపరులు ఆ భగవంతుడ్ని భయం గుప్పెట్లో బంధించి దుర్మార్గమైన కులవ్యవస్ధను,మూఢాచారాలను,మూఢవిశ్వాసాలను పాదుగొల్పి సమాజాన్ని తనవైపు తిప్పుకొని అధికారాన్ని చెలాయించటానికి ప్రయత్నిస్తే అటువంటి వారిని చివరకు భగవంతున్ని కూడ వదలకుండా గొప్పగా తిట్టిపోసిన దైర్యసాహసి వేమన అని ,వేమన తొటి మనిషికి సహాయపడటమే దైవత్వం అని చెప్పిన మహానీయుడు అని తెల్పారు.మనుషుల్లో కులాలు గొప్పవనే ప్రాతిపదిక వదిలి గుణానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసిన మొదటివ్యక్తి వేమనన్నారు.

ఆయన కవిత్వంలో సామెతలు, జాతీయాలు, నుడులు తెలుగు తనాన్ని ఉట్టిపడే విధంగా,సందర్భోచితమైన ఉపమానాలు లోకపరిశీలనానుభవాలకు సంకేతంగా వాడిన సమర్ధుడైన కవివేమన అంటూ ఆయన కవితారీతులు గూర్చి వివరించారు.వేమనది సమాతాతత్వం అని సర్వమానవ శ్రేయస్సే లక్ష్యంగా కవిత్వం అల్లారని అటువంటి వేమన పద్యాలను విదేశీయులు వెలికితీసి మనకు అందించారని వారిని  తెలుగుజాతి మర్చిపోకూడదన్నారు.దాదాపు 40 దేశాల వాళ్ళు ఆయన పద్యాలను తమ భాషల్లోకి అనువదించుకొని తెలుగు పద్య మాధుర్యాన్ని ,విశేషమైన లోకరీతిని గ్రహించగలిగారన్నారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన ఆచార్య వెలమల సిమ్మన్న ప్రసంగిస్తూ వేమన సంఘసంస్కరణ భావజాలాన్ని తన రచనల ద్వారా సమాజానికి అందించిన మహానీయుడన్నారు.సమాజంలో ఆనాటి సాంఘీకజీవనంలో ప్రతి అంశాన్ని స్పృజించి సమాజ అభివృధ్ధి నిరోధక విధానాలను తూర్పారబడుతూ పదునైన ఈటెలవంటి ఆటవెలది పద్యాలలో సులభశైలిలో అక్షరాయుధాన్ని సంధించి అశుకవితాధారలు కురిపించిన ప్రజాకవి వేమన అని కొనియాడారు.మరో విశిష్ట అతిథిగా హాజరైన 

సుధారాణి కొండపు

(బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, 

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా)–ఉత్తర అమెరికా) మాట్లాడుతూ అమెరికా వంటి దేశాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ తెలుగు వాళ్ళంతా వసుధైక కుటుంబంగా జీవిస్తున్నామని ముఖ్యంగా అక్కడ పిల్లలకు విశ్వకవియైన వేమన పద్యాలను నేర్పిస్తూ ఆ పద్యాలలోని మాధుర్యాన్ని నీతిబోధక విషయాలను విశ్లేషిస్తూ వివరిస్తున్నామని విద్యార్ధులు సులభంగా పద్యాలు నేర్చుకోవటానికి వీలుపడుతుందన్నారు.విదేశయులు కూడ వేమన పద్యాలను నేర్చుకుంటూ ఇంగ్లీష్ రైమ్స్ పాడుకుంటున్నట్లు మన పద్యాలు పాడుకుంటున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో సమైక్యభారతి జాతీయ సమన్వయకర్త శ్రీ పి కన్నయ్య, తెలుగు ఆచార్యులు డా అయ్యగారి సీతారత్నం,డా అన్నంశెట్టి ఈశ్వరమ్మ,డా బూసి వెంకటస్వామి,డా కట్టెపోగు రత్నశేఖర్ ,డా పెండ్యాల లావణ్య,శ్రీ ఆతుకూరి వెంకటేశ్వర్లు(యోగి),బోధనేతర సిబ్బంది మరియు పరిశోధక విద్యార్ధులు,స్నాతకోత్తర విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS