SAKSHITHA NEWS


Ananta Padmanabhavrat is celebrated in Tirumala

తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభవ్రతం.

తిరుమలలో శుక్రవారం అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

   అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్థశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చంద‌నంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంత‌రం చక్రస్నానాన్ని వైభ‌వంగా నిర్వహించారు. 


  శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి  ఎంత ప్రాశస్త్యం ఉంది. అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉన్నది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో ఈ రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.


 తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రత్తాళ్వారులకు చక్రస్నానం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో విజీవో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్‌ శ్రీ శ్రీహరి , ఇతర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS