ఉద్యోగులకు ఇళ్లస్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
– శ్రీవారి ఆశీస్సులతో మహిళలకు మంగళసూత్రాలు
– కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు
– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి
తిరుమల, 2024 జనవరి 29: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఛైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
– ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారుచేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయం. ఇవి 5 గ్రాములు, 10 గ్రాముల్లో ఉంటాయి. వీటిని నాలుగు లేదా ఐదు డిజైన్లలో తయారు చేస్తాం. వీటితోపాటు లక్ష్మీకాసులను కూడా తయారు చేయాలని నిర్ణయం. వీటిని లాభాపేక్ష లేకుండా విక్రయిస్తాం. గతంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జరిపించినపుడు మంగళసూత్రాలు అందిస్తే ఏ ఒక్కరూ మతం మారలేదు. మహిళలకు స్వామివారి కానుక ఇది.
– టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదం.
– దాదాపు 30 ఏళ్లుగా ఇళ్లస్థలాల కోసం ఎదురుచూసిన టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన మాన్య ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
– టీటీడీలోని వివిధ విభాగాలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచాం.