A permanent building should be built for Suda
సుడాకు శాశ్వత భవనం నిర్మించాలి
-జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ –
శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ శాశ్వత భవనం ఉండాలని,దీనికి సంబంధించిన పనులు మరో రెండు మాసాల్లో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సుడా అధికారులను ఆదేశించారు.సుడా బోర్డు సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఛైర్ పర్సన్ కోరాడ ఆశాలత, వైస్ ఛైర్మన్,సంయుక్త కలెక్టర్ యం.నవీన్ ఆధర్వంలో బుధవారం జరిగింది.ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇంతవరకు అద్దె భవనంలో ఉన్న సుడా ఇకపై శాశ్వత భవనంలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వీటికి సంబంధించిన బోర్డు అనుమతితో తమకు ప్రతిపాదనలను సమర్పించాలని,మరో రెండు మాసాల్లో పనులు ప్రారంభం కావాలని వైస్ ఛైర్మన్ కు కలెక్టర్ తెలిపారు. వంశధార కార్యాలయంలోని సుమారు 30 సెంట్ల ఖాళీ స్థలాన్ని గుర్తించి అక్కడ నిర్మించేందుకు సాధ్యాలను పరిశీలించాలని సూచించారు. సుడా వద్ద అందుబాటులో ఉన్న నిధులతో భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కొత్తగా ఏర్పాటైన సుడాకు ఛార్టర్డ్ అకౌంటెంట్ అవసరమై ఉన్నందున సంవత్సరం ప్రాతిపదికన సి.ఏను నియమించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో సుడా ఛైర్ పర్సన్ కోరాడ ఆశాలత, సంయుక్త కలెక్టర్ యం.నవీన్, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషు,రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ కె.కాంతిమతి, జిల్లా పర్యాటక అధికారి యన్.నారాయణరావు, ఆం.ప్ర. కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్ ఎం.శంకర్ నాయక్, సుడా కార్యదర్శి బి.రమణమ్మ, ప్లానింగ్ అధికారి టి.జి.రామ్మోహన్ రావు, పరిపాలన అధికారి సిహెచ్.శాంతాకుమారి, సహాయ ప్లానింగ్ అధికారి ఎం.రాధాకృష్ణ, ప్లానింగ్ కార్యదర్శులు యు.బాలభాస్కర్, ఎ.కృష్ణారావు, సిహెచ్.వెంకటరమణ, పి.వెంకటేష్, ఎం.జయంత్ తదితరులు పాల్గొన్నారు.