ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహానీయుడు, కవి కాళోజీ రావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన కాళోజీ రావు జయంతి వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 1992లో భారతదేశ అత్యున్నత పద్మ విభూషన్ పురస్కారాన్ని పొందారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం సెప్టెంబర్ 9 వ తేదీన కాళోజీ జయంతి ని అధికార భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటూ గౌరవిస్తుందని తెలిపారు. మరణించిన ప్రజల మనస్సులో ఎల్లప్పుడూ జీవించే వారు కొందరే ఉంటారని, అందులో కాళోజీ నారాయణ రావు ఒకరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ స్మారక అవార్డు కు ఎంపికైన కవి జయరాజ్ ను మంత్రి సన్మానించారు.