కాంగ్రెస్, BJP పార్టీల నేతలకు దమ్ముంటే వారం రోజుల్లో MLA అభ్యర్ధులను ప్రకటించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయా పార్టీ నేతలకు సవాల్ చేశారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ లో గల తుల్జభవాని ట్రస్ట్ లో BC కుల వృత్తి దారులకు ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ దమ్మున్న మా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే MLA అభ్యర్థులను ప్రకటించారని గుర్తుచేశారు. BJP కి అభ్యర్థులు లేరని…. కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలకే పరిమితమైందని విమర్శించారు. నిజంగా మీకు దమ్ముంటే వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, BJP పార్టీలను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పే ధైర్యం మాకుందని, ఏం చేశారో చెప్పే దైర్యం మీకుందా అని ప్రశ్నించారు.
అభివృద్ధి లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, BJP పార్టీల పై ప్రజలకు విశ్వాసం లేదని, KCR నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే BRS అభ్యర్ధులను గెలిపిస్తాయని, ప్రజలు తిరిగి BRS ప్రభుత్వ ఏర్పాటుకు పట్టం కడతారని చెప్పారు.