భద్రాచలానికి రూ. వెయ్యి కోట్ల హామీ ఏమైంది..?
- మళ్లీ అధికారంకోసం పాకులాట
- మా పార్టీ అధికారంలోకి రాగానే భద్రాచలానికి, మున్నేరుకు ఆర్ సీ సీ వాల్స్ ఏర్పాటు చేయిస్తాం
- కాంక్రీటు వాల్ కు, మట్టి గోడలకు తేడా మీకు తెలుసా…?
- తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- మున్నేరు ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
మాట తప్పం…. మడం తిప్పం అని చెబుతూ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం కలేనని, ఆ కలలన్ని కలలాగానే మిగిలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మున్నేరు ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీలో భాగంగా బొక్కల గడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన వరద బాధితులందరికీ నిత్యావసర వస్తులను అందజేయడం జరుగుతుందన్నారు.
గతేడాది భద్రాచలంలో ఏర్పడిన వరదల సందర్భంగా ఆ ప్రాంతంలో పర్యటించిన సీఎం కేసీఆర్ రూ. వెయ్యి కోట్లును ప్రకటించారని, కానీ ఏడాది గడుస్తున్నా నేటికీ పైసా ఇచ్చింది లేదని దుయ్యబట్టారు. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తామని, పాడైపోయిన ఇళ్లను మరమ్మత్తులు చేయిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. మళ్లీ వర్షాకాలం వచ్చి వరదలు వచ్చినా ఆ హామీల్లో ఒకటి కూడా నేరవేర్చలేదని ఆరోపించారు. పైగా వాటన్నింటిని పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలని బిల్డింగ్లు, భవనాలు నిర్మిస్తామని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు తిరుగుతున్నారన్నారు.
కానీ వారి మాటలను విశ్వసించే స్థితిలో ప్రజలు లేరని, ఖచ్చితంగా రాబోయే మూడు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చి తీరుతుందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి మనమంతా కానుకగా ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అటు భద్రాచలంలో ఇటు ఖమ్మం మున్నేరుకు ఆర్ సీ సీ వాల్స్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. కాంక్రీటు వాల్ కు, మట్టిగోడలకు తేడా తెలియని ప్రజాప్రతినిధులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారి మాటలకు కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి పువ్వాడ, ఇతర బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు.
ఎవరూ అధైర్యపడొద్దని వచ్చే వర్షాకాలం నాటికి శాశ్వతమైన పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందని పేర్కొన్నారు. మరమ్మత్తులకు గురైన ఇండ్ల బాధితులకు కుటుంబానికి రూ. 25వేల చొప్పున, వరదల కారణంగా వ్యక్తులు చనిపోయిన కుటుంబాలకు రూ. పది లక్షలను ఎక్స్ గ్రేషియేగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్ యాదవ్, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, చావా శివరామకృష్ణ, రాంరెడ్డి చరణ్ రెడ్డి, పార్టీ నగర ఓబీసీ సెల్ ఛైర్మన్ బాణాల లక్ష్మణ్, కొప్పెర ఉపేందర్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్, మందడపు తిరుమలరావు, కొంగర జ్యోతిర్మయి, చింతమళ్ల గురుమూర్తి, నవాజ్, బీరేష్, రామకృష్ణ, తుపాకుల మధు, నాగరాజు, మధుసూధన్ రెడ్డి, బోజెడ్ల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.