SAKSHITHA NEWS

గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)లను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

సాక్షిత : మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా సబ్ కమిటీ ఇవాళ్టి నుంచి కసరత్తు ప్రారంభించనుంది. మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం… వీఆర్ఏలను విద్యార్హతలు, సామర్థ్యాలను అనుసరించి నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రగతిభవన్లో వీఆర్ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి అన్ని శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక సూచనలు చేశారు. వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇందుకోసం కేటీఆర్ నేతృత్వంలోని ఉపసంఘం… వీఆర్ఏలతో ఇవాళ్టి నుంచి చర్చలు ప్రారంభించాలని తెలిపారు. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకొని వీఆర్ఏల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉపసంఘం కసరత్తు పూర్తయి నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని ఆదేశించారు.

సింహభాగం నీటిపారుదల… మిషన్‌ భగీరథలకే : వీఆర్‌ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా నీటిపారుదల శాఖ, మిషన్‌ భగీరథలకే ఎక్కువ మందిని మళ్లించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 23,046 వీఆర్‌ఏ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 21,433 మంది విధుల్లో ఉన్నారు. క్రమబద్ధీకరణ అనంతరం పేస్కేల్‌ కింద ఎంత మొత్తం చెల్లించాలనేది ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది.

వీఆర్‌ఏలలో పీజీ, డిగ్రీ లాంటి ఉన్నత విద్య పూర్తి చేసిన వారు దాదాపు 5వేల మంది ఉన్నారు. నీటిపారుదల శాఖలో సహాయకుల కింద 1,034 మందిని, లష్కర్ల కింద 4,374 మందిని, 3వేల మందిని మిషన్‌ భగీరథలో నియమించాలని భావిస్తున్నారు. మిగిలిన వారిలో కొందరిని రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ వంటి శాఖల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు
వివిధ శాఖల్లో దిగువస్థాయి కేడర్‌ వివరాలను ప్రభుత్వం ఇటీవల తెప్పించుకుంది. వీరిలో ప్రత్యక్ష నియామక పద్ధతి కింద టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన 2,783 మందిని కొనసాగించే అవకాశాలున్నాయి. 60 ఏళ్లు నిండిన వారిని రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని భావిస్తున్నారు. గ్రామానికి ఒక వీఆర్‌ఏని కొనసాగించేందుకు కూడా ప్రభుత్వవర్గాలు ఆలోచిస్తున్నాయి. రాష్ట్రంలో 10,485 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. పెద్ద రెవెన్యూ గ్రామాలకు ఇద్దరిని ఏర్పాటు చేయాలనే ఆలోచనా ఉంది.

అయితే ఐచ్ఛికాలు ఇచ్చి ఇతర శాఖలో సర్దుబాటు చేయాలని వీఆర్‌ఏ ఐకాస కోరుతున్న నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం తీసుకునే నిర్ణయం ఆధారంగా తుది కేటాయింపులు ఉండే అవకాశముంది. ప్రజలకు అందించే సేవలను దృష్టిలో పెట్టుకుని గ్రామానికి ఒక వీఆర్‌ఏను కొనసాగించాలని, దీనిపై గతంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని ట్రెసా రాష్ట్ర కార్యవర్గం కోరింది. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేసింది.


SAKSHITHA NEWS