జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని పలు గ్రామ పంచాయతీలను మండల స్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణ నందు ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన ఎంపీడీవో కే.జాన్ లింకన్ ఆధ్వర్యంలో పలు గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు మండల స్థాయి ఉత్తమ పంచాయతీ పురస్కారం అవార్డులను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో తొమ్మిది ప్రధాన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీలలో ప్రధమ,ద్వితీయ,తృతీయ అవార్డులుగా మూడేసి పంచాయతీల చొప్పున మొత్తం 27 మండల స్థాయి పురస్కారాలు పంపిణీ చేస్తామని తెలియజేసి రాబోయే రోజుల్లో కూడా గ్రామీణ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని తెలియజేసి వారిని అభినందించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో గ్రామ సర్పంచులకు దృశలువాలు కప్పి,పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆయా పంచాయతీలకు ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు చేతుల మీదుగా పురస్కారాలు,మేమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఐపీ శెట్టి, ఎంఈఓ డి.మురళి సత్యనారాయణ, ఈవోపీఆర్డి రాజ్ కుమార్, ఏవో రామ స్వరూప్, పలు గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.