మదర్ సాహెబ్ షేక్
9440449642
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
రమజాన్ ఉపవాసాల ద్వారా ముస్లిం సమాజంలో చోటు
చేసుకునే మరో విశిష్ట లక్షణం సానుభూతి, సమతా భావన. రమజాన్ నెలలో ఒక వ్యక్తి పగటిపూట ప్రత్యేక సమయం వరకు అన్న పానీయాలకు దూరంగా ఉంటాడు. తత్కారణంగా అతడికి ఆకలి, దాహం అనుభవంలోకి వస్తాయి. అన్నపానీయాలకు దూరంగా ఉండి అతడు ఆకలిని, దాహతృష్ణను అనుభవించి. సత్యాన్ని గుర్తెరుగుతాడు. పేదరికం, లేమి కారణంగా ఆకలితో అలమటించే వారు ఒక్కో మెతుకు కోసం ఎలా అర్రులు చాస్తారో వారి దీనావస్థ ఏ విధంగా ఉంటుందో అవలోకనం చేసుకుం టాడు. దాంతో విశ్వాసికి బీదవారు, అనాధలు మొదలైన వారి పట్ల సానుభూతి కలిగి అలాంటి వారికి సహాయ పడాలనే మనస్తత్వం జనిస్తుంది. ఈ కారణం చేతనే ప్రవక్త(స) హదీసు ప్రబోధంలో పవిత్ర రమజాన్ మాసాన్ని సానుభూతి చూపాల్సిన నెలగా చెప్పడం జరిగింది. (బైహఖీ, విశ్వాస ప్రకరణం)
మౌలానా సయ్యద్ అబుల్ అలా మౌదుదీ ( రహ్మలై) ఈ అంశం గురించి ఇలా విశ్లేషించారు.
ఈ సామూహిక ఆరాధన మూడవ మహత్తరమైన కార్యం. ఇది జనులందరినీ ఒకే వేదిక పైకి తీసుకొని వస్తుంది. ఉపవాసం వల్ల రోజూ కొన్ని గంటలపాటు ఒక సంపన్నుడికి ఆకలితో అలమటించే సాటి సోదరుని దీనావస్థ అనుభవంలోకి వస్తుంది.ఫలితంగా అతడు సదరు నిరుపేద సోదరుని కష్టాన్ని వాస్తవ కోణంలో దర్శిస్తాడు. దేవుని అభీష్టాన్ని చూరగొనే వైఖరి అతడిని తన బీద సోదరుల సహాయకుడిగా మారేలా ప్రేరేపిస్తుంది. చూడటానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ ఉపవాసం నైతిక, సాంస్కృతికమైన లాభాలు గణనీయమైనవి. ఏ జాతికి చెందిన సంపన్నుల్లో నిరుపేదలు, బీదసాదల కష్టాల పట్ల మానసికంగా స్పృహ కలిగి ఉండటం, ఆచరణా పూర్వకంగా సానుభూతి నైజాన్ని ఏర్పరచుకోవడం, అలాగే సంస్థాగత వ్యక్తులకే విరాళాలు దానాలు పంచడం కాకుండా పేరు పేరునా ప్రతి ఒక్క అవసరార్థిని వెతికి మరీ పట్టుకుని సహాయ సహకారాలు అందేలా చేయడం జరుగుతుందో ఆ జాతికి చెందిన బలహీన వర్గాలు వినాశనం నుండి సురక్షితంగా ఉంటారు. పైగా పేద, సంపన్నుల మధ్య అసూయ ఈర్ష్య ద్వేషాల స్థానంలో ప్రేమ, సానుభూతితో కూడిన సంబంధాలు బలపడతాయి. సాధారణంగా పేద ధనిక వర్గాల మధ్య తటస్థించే వర్గ పోరు ఎటువంటిదంటే అది కేవలం పేదవారి ఆకలి దీనావస్థ గురించి ఎరుగని శ్రీమంతులు ఉన్న సమాజంలోనే కనిపిస్తుంది. అటువంటి కలవారు కరువు సమయంలో ఆశ్చర్యంగా ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు. “అసలు జనం ఆకలితో ఎందుకు చనిపోతున్నారు? వారికి పట్టెడన్నం ‘లభ్యం కాకపోతే ఈ ఎంగిలి మెతుకులు ఎందుకు తినకూడదు’అని ఎదురు ప్రశ్నిస్తారు!? (ఇస్లామీ. ఇబాదాత్ పర్ ఏక్ తహ్రీబీ నజర్: పుట 110-111)
ఏ మనిషిలోనైతే ఇతరుల పట్ల సానుభూతి భావన జనిస్తుందో అతడు సాధ్యమైనంత మేరకు సహాయపడతాడు. వారి కష్టాల్లో ఆపదల్లో నేనున్నానంటూ ముందుకు వస్తాడు. వారికి లేమి స్థితిలో ఆసరాగా ఉంటాడు. చేతనైతే ఆర్థికంగా సహాయ పడతాడు, ఆర్ధిక స్థోమత లేకపోతే ఆర్థికంగా కలవారిని సహాయ పడమని ప్రేరేపిస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తిలో గనక అసలు సానుభూతి భావనే జనించకపోతే ఎవరి గురించీ తన మదిలో ఆలోచన సైతం కలిగి ఉండడు. అతడి వద్ద ధనరాశులు కుప్పలు. తెప్పలుగా పడి ఉన్నా ఒక్క పైసా కూడా ఇతరుల కోసం ఖర్చు పెట్టడు..
‘మానవ సేవ’ అన్నది ధనవంతులు చేయాల్సిన పని అని మనం అపోహ పడతా. యథార్థానికి ఇది సబబు కాదు. ప్రజాసేవ, మానవసేవ చేయడానికి శ్రీమంతులు కానక్కర్లేదు. మానవసేవ ఆర్ధికంగానే కాదు ఇతర అనేక పద్ధతుల్లో చేయవచ్చు. ఒకసారి దైవ ప్రవక్త(స) తన సహచరుల సమావేశంలో ఇలా ప్రవచించారు: “ఏ వ్యక్తి అయితే ఒక ఉపవాసికి ఇఫ్తార్ (ఉపవాస విరమణ) విందు ఏర్పాటు చేస్తాడో అతని పాపాలు మన్నించబడతాయి. అతడికి నరకం నుండి విముక్తి కలుగుతుంది. ఉపవాసికి లభించే ప్రతిఫలం దక్కుతుంది. ఉపవాసం ఉన్న వ్యక్తికి అందే ప్రతిఫలంలో కూడా ఏ లోటు జరగదు. ఈ ప్రవచనానికి ఆయన. (స) సహచర బృందం ఆయన (స)తో ఇలా ప్రశ్నించ సాగారు: “ఓ దైవప్రవక్త! మా అందరిలో ప్రతి ఒక్కరి వద్ద ఇతరులకు పంచిపెట్టే అంతటి ఆహార పదార్థాలు ఉండవు, మరి మా సంగతి ఏమిటి? అని. దానికి ఆయన ఇలా వివరణ ఇచ్చారు: అల్లాహ్ ఇచ్చే ఈ పుణ్యం ఇఫ్తార్ సమయంలో ఎవరికైనా ఒక ఖర్జూర పండు అయినా సరే, లేదంటే పాలు, నీళ్ల ఒక్క గుక్కడైనా సరే త్రాపించిన అతనికి కూడా పుణ్యం దక్కుతుంది .