మాస్టర్ ప్లాన్ రోడ్లను వేగవంతం చేయాలి : కమిషనర్ అనుపమ అంజలి
సాక్షిత : తిరుపతి నగరంలో రూపుదిద్దుకుంట్టున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ఆధికారులకు ఆదేశాలు జారీ చేసారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు జరుగుతున్న కొర్లగుంట మెయిన్ రోడ్, చింతలచేను, హిరోహోండా షోరూమ్, అంకురా హాస్పిటల్ ప్రదేశాలను మంగళవారం కమిషనర్ అనుపమ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న జనాభాకి సౌకర్యవంతంగా వుండేలా, అధిక సమయం ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడే వాహనదారులకు అనువుగా వుండేలా మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించడం జరుగుతున్నదన్నారు.
మాస్టర్ ప్లాన్ రోడ్లలో బిటి రోడ్లును శరవేగంగా వేయించాలని, కోర్ట్ కేసులు వున్నవాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పనులు వేగవంతం చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు, ప్లానింగ్ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి అయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరుతాయని కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవికుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రహ్మణ్యం, షణ్ముగం, డిఈలు సంజీవ్ కుమార్, మహేష్ పాల్గొన్నారు.