దృష్టి లోపం లేని తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
దృష్టి లోపం లేని తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కోన్నారు. ఖమ్మం కార్పోరేషన్ 14వ డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్‌తో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ జనవరి 19వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 100 రోజుల పాటు 55 బృంధాలతో విజయవంతంగా కొనసాగుతున్నదని, జూన్ వరకు నిర్వహించే రెండవ విడుత కంటి వెలుగులో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న వైద్య బృందాలు పర్యటించి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, శిబిరాలకు వచ్చిన ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి వారికున్న దృష్టిలోపాన్ని బట్టి రీడిరగ్ గ్లాసులను పంపిణీ చేస్తున్నారన్నారు. దూరపు చూపు సమస్య ఉన్న వారికి ప్రిస్కిప్షన్ కళ్ళజోళ్లను ఇండెంట్ పెట్టడం జరుగుతుందన్నారు. వీటితో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ మాత్రలు, కండ్లల్లో వేసుకోవడానికి చుక్కల మందును అందజేస్తున్నారన్నారు. శిబిరాలు నిర్వహిస్తున్న ప్రతి చోట ప్రజలు కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని, ఎవ్వరూ దృష్టిలోపం లేకుండా మంచి చూపుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పరీక్షలను నిర్వహించిన అనంతరం వారికి కళ్ళఅద్దాలను పంపిణీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఇప్పటి వరకు కంటి వెలుగు శిబిరాల నిర్వహణ, కళ్ళజోళ్ళ పంపిణీ వివరాలు అడిగితెలుసుకున్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డి.సి.సి.బి. చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణా, కూరాకుల వలరాజ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ క్రిష్ణలాల్, వైద్యులు బాలకృష్ణ, సంధ్యారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.