Scientific study on covid vaccines?
కోవిడ్ వ్యాక్సిన్లపై శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నారా?
కేంద్రం వద్ద ఉన్న సమాచారం ఏమిటీ?
కేంద్రాన్ని లిఖిత పూర్వకంగా ప్రశ్నించిన ఎంపీ నామ నాగేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
దేశంలో ప్రజలపై కోవిడ్ వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల ప్రభావం, వాటి దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏమైన శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించాలని యోచిస్తుందా? అని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు లోక్ సభలో లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అమెరికాలో 50 శాతం మరణాలు టీకాలు వేసిన వారిలోనే ఉన్నట్లు అక్కడి ఒక అధ్యయనం పేర్కొందని, ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఉన్న సమాచారం ఏమిటని నామ ప్రశ్నించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకున్న లేదా ప్రతిపాదించిన చర్యలు ఏమిటని ప్రశ్నించారు. కోవిడ్ లాంటి మహమ్మారీలను ఎదుర్కొవడానికి కేంద్రం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో తెలియజేయాలని నామ కోరారు.
దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వివరణ ఇస్తూ దేశీయంగా ప్రజలకు అందించిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల వల్ల మంచి రోగ నిరోధక శక్తి పెంపొందినట్లు కేంద్రం నిర్వహించిన అధ్యయనాల్లో తేలిందని తెలిపారు
. ఐసీఎంఆర్ 2021 మే, జూలై నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్లుపై వివిధ కేంద్రాలు, విభిన్న ఆస్పత్రుల్లో కేస్ కంట్రోల్ స్టడీ నిర్వహించిందన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి అయిన తర్వాత కోవాగ్జిన్ 71 శాతం, కోవిషీల్డ్ 85 శాతం సామర్ధ్యాన్ని చూపుతున్నట్లు పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి, రోగ నిరోధక శక్తి పెంపొందడానికి బూస్టర్ డోస్ మోతాదు సురక్షితమైందని, అవసరమని కూడా అధ్యయానాల్లో తేలిందని కేంద్ర మంత్రి చెప్పారు.