SAKSHITHA NEWS

I am a Gandhian..I am not a quarrelsome type: Minister Mallareddy

నేను గాంధేయవాదిని..గొడవ పెట్టుకునే రకం కాదు:మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: మేడ్చల్‌ జిల్లాలో భారాసకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తనపై చేసిన వ్యాఖ్యలను మీడియానే పెద్దదిగా చూపుతోందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తమది క్రమశిక్షణ గల పార్టీ అని.. ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. పదవుల కేటాయింపు విషయంలో మల్లారెడ్డి వైఖరిపై అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి స్పందించారు.

‘‘పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తప్ప నేను కాదు. నేను గాంధేయవాదిని.. ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదు. జిల్లా చెందిన పార్టీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మాట్లాడతా. మా మధ్య అంత సమస్యేం లేదు. అవసరమైతే వాళ్లందరినీ మా ఇంటికే ఆహ్వానిస్తా. కావాలనే కొందరు దీన్ని పెద్దది చేసి చూపుతున్నారు’’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

ఏం జరిగిందంటే..

నామినేటెడ్‌ పదవుల భర్తీలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సోమవారం ఐదుగురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కేపీ వివేకానంద్‌, భేతి సుభాష్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ శివారు దూలపల్లిలోని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో వారు సమావేశమయ్యారు. అన్ని పదవులను మంత్రి తన సొ నియోజకవర్గం మేడ్చల్‌ నాయకులకే కట్టబెడుతున్నారని, పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వద్దనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి స్పందించారు.


SAKSHITHA NEWS