No more holidays… here again in a new form..
ఇక శెలవు… మళ్లీ కొత్త రూపం లో ఇక్కడే…
1975 లో నిర్మించిన తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం పాత భవనం మంగళవారం సాయత్రం కూల్చివేశారు. దాదాపు 50 సంవత్సరాలు దాటిన ఈ భవనం తిరుపతికి ఒక లాండ్ మార్క్.
స్వాతంత్య్రం రాక మునుపే ఏర్పడ్డ తిరుపతి పురపాలికకి తిరుపతి నగరంలో కృష్ణాపురంఠనా వద్ద ప్రస్తుత షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో కార్యాలయం ఉండేది. ఆ భవనం నుంచి పెరిగిన పట్టణ అవసరాలకు తగ్గట్టుగా ప్రస్తుతం కూల్చి వేతకు గురైన భవనంలోకి కార్యాలయం 1975 వ సంవత్సరం లో మార్చారు.
అప్పటి నుంచి ఈ భవనంలోనే సాధారణ మునిసిపాలిటీగా ఉన్న తిరుపతి పట్టణం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నతి పొందింది. ఈ భవనంలో ఉన్నప్పుడే నగర స్థాయి సంతరించుకుని 2007 మార్చి 1వ తేది మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులుతో మున్సిపల్ కార్పొరేషన్ గా మారింది.
కమీషనర్లుగా ఐఎఎస్ ల పాలన మొదలైంది ఈ భవనంలోనే. తొలి మున్సిపల్ కార్పొరేషన్ కొలువుతీరింది ఇక్కడే. తొలి తిరుపతి మహిళ మేయర్ డాక్టర్ శిరీష మేయర్ పీఠంపై కూర్చున్నది తిరుపతి నగరపాలక సంస్థ పాత భవనం లోనే.
ఈ మున్సిపల్ కార్యాలయం నుంచే తిరుపతి రాజకీయ ఉద్దండులు పిఎస్ గురవారెడ్డి, పూల మునిరత్నం, మాజీ ఎమ్మెల్యేలు మబ్బు రామిరెడ్డి, వెంకటరమణ… కందాటి శంకర్ రెడ్డిల రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎందరో హేమాహేమిలు మున్సిపల్ కౌన్సిలర్స్ గా జనం సమస్యలపై గళం విప్పింది ఈ భవనంలోనే.
ఈ కార్యాలయంలోనే అనేక మంది కలెక్టర్ లు స్పెషల్ ఆఫీసర్ లుగా పాలనా పర్యేక్షించారు.
ఇంతటి ఘన చరిత్ర ఉన్న నేటి మున్సిపల్ భవనం పాతది కావడంతో కూల్చివేశారు. ఈ భవనం స్థలంలోనే హైటెక్ హంగులతో అరు అంతస్థుల నూతన భవనం సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మితం కానున్నది. సోమవారం, మంగళవారం భవనం కూల్చివేతను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలిలు పర్యవేక్షించారు.
కొత్త భవనం నిర్మించేంత వరకు తాత్కాలికంగా కార్పొరేషన్ భవనంగా స్విమ్స్ రోడ్డు ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలోని ఖాళీగా వున్న భవనం నుండి పుర సేవలు ప్రారంభమయ్యాయి.
2024 సంవత్సరానికి పాత మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం కూల్చిన స్థలంలోనే కొత్త సిటి ఆపరేషన్ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి రానున్నది.