Notice to BJP candidate Komatireddy Rajagopal Reddy
ఆ రూ.5.22 కోట్ల సంగతే0టి?
▪️ భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసు
▪️ తెరాస ఫిర్యాదు పై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం
▪️ నేటి సాయంత్రం లోపు సమాధానం చెప్పాలని ఆదేశం
సాక్షిత దిల్లీ: ఓటర్లను ప్రలోభపెట్టడానికి భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన కుటుంబ సంస్థ సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌కు చెందిన ఎస్‌బీఐ ఖాతా నుంచి మునుగోడు నియోజకవర్గం పరిధిలోని 23 మంది వేర్వేరు వ్యక్తుల ఖాతాలకు రూ.5.22 కోట్లను బదిలీ చేశారని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెరాస ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ శనివారం ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.
దీనిపై సమాధానం చెప్పాలని రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీచేసింది. ‘‘మీ కుటుంబ ఆధ్వర్యంలోని సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఖాతా నుంచి ఈ నెల 14, 18, 29 తేదీల్లో మునుగోడు నియోజకవర్గం పరిధిలోని 23 మంది వేర్వేరు వ్యక్తుల ఖాతాలకు నగదు బదిలీ అయిందని, ఆ నగదును విత్‌డ్రా చేసి ఓటర్లకు పంపిణీ చేయడానికే అలా బదిలీ చేశారని తెరాస ఫిర్యాదు చేసింది.
ఆ నగదు మీ ద్వారా గాని, మీ ఆదేశాల ప్రకారం గాని మీ కంపెనీ బదిలీ చేసి ఉంటే ఆ డబ్బును ఓటర్లను ప్రలోభపెట్టడానికి పంపలేదని భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రలోభపెట్టడానికే బదిలీ చేసి ఉంటే అది అవినీతి చర్య కిందికి వస్తుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం అన్ని పార్టీలు, అభ్యర్థులు అవినీతి చర్యలకు దూరంగా ఉండాలి. తెరాస ప్రధాన కార్యదర్శి ఫిర్యాదులోని అన్ని అంశాలపై స్పష్టత ఇస్తూ సోమవారం సాయంత్రం 4 గంటల్లోపు సమాధానం పంపండి’’అని రాజగోపాల్‌రెడ్డిని ఈసీ ఆదేశించింది.