wicked-idea-to-block-the-gods-for-politics
సాక్షిత : రాజకీయాల కోసం దేవుళ్ళను అడ్డం పెట్టుకోవడం దుర్మార్గపు ఆలోచన అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం NTR మార్గ్ నుండి ట్యాంక్ బండ్ వరకు ఈ నెల 9 వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఓపెన్ టాప్ వాహనంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , మీడియా తో కలిసి పరిశీలించారు. అనంతరం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే విధంగా అన్ని పండుగలను గొప్పగా జరపాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ వస్తుందని చెప్పారు.
హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. నవరాత్రుల సందర్భంగా GHMC పరిధిలో సుమారు 38 వేల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని, నిర్వాహకులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం GHMC, పోలీస్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్, ఎండోమెంట్, ఎలెక్ట్రికల్, టూరిజం, హెల్త్, R & B, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల ఖర్చుతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. 2014 కు ముందు ఇన్ని ఏర్పాట్లు లేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాతనే పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఎంతో పవిత్రంగా 9 రోజులపాటు జరుపుకొనే వినాయక చవితిని దేశవ్యాప్తంగా ఎంతో గొప్పగా నిర్వహిస్తారని అన్నారు. హిందూ సాంప్రదాయంలో ఎలాంటి శుభకార్యం చేపట్టినా ముందుగా గణనాదుడికి తోలిపూజలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు.
9 వ తేదీన నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించే వినాయక ఊరేగింపు దారిలో స్వాగతం పలుకుతూ బాలాపూర్ వినాయకుడి నుండి లాల్ దర్వాజ, చార్మినార్, అప్జల్ గంజ్, బేగం బజార్, MJ మార్కెట్ తదితర ప్రాంతాలలో స్టేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ప్రపంచంలో ఒక ప్రత్యేకత ఉన్న ఖైరతాబాద్ వినాయకుడిని ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసి ప్రతిష్టించడం జరిగిందని చెప్పారు. గణేష్ ఉత్సవాల నిర్వహకులను ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. బెంగుళూరు లో 8 అడుగుల కు మించి వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించాలని నిబంధనలను విధించారని, తెలంగాణ లో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలను పెట్టలేదని స్పష్టం చేశారు. వినాయక చవితి ప్రారంభం నుండి రేయింబవళ్ళు ఏర్పాట్లలో నిమగ్నమైన ఉద్యోగులు, సిబ్బంది మనోస్తైర్యం దెబ్బతినే విధంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు.
అన్ని మండపాల వద్ద GHMC పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. నిమజ్జనం సందర్భంగా 10 వేల మందికి పైగా పారిశుధ్య సిబ్బంది మూడు షిఫ్ట్ లలో విధులు నిర్వహిస్తారని వివరించారు. అంతేకాకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేందుకు ప్రత్యేకంగా CC కేమేరాలను ఏర్పాటు చేయడమే కాకుండా పటిష్ట బందోబస్తు కోసం నగరం లోని పోలీసులే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందని అన్నారు. ఊరేగింపు నిర్వహించే రహదారులు, నిమజ్జనం ప్రాంతాలలో పెద్ద ఎత్తున లైట్లను, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
5 వ రోజు నుండే నిమజ్జనం ఎంతో ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ దానిపై కూడా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. హిందువుల పండుగలు అంటూ వేరుచేసి మాట్లాడుతున్నారు…మేము హిందువులము కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు, ప్రవర్తనలను మానుకోవాలని హితవు పలికారు.