ఏ ఒక్క ఇంట్లో కూడా అర్హత ఉండి సంక్షేమ పథకాలు ఆగలేదు
గత ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే కొత్త పెన్షన్ ఇచ్చేవారు..కానీ నేడు ఆ పరిస్థితి లేదు
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి
మైలవరం నియోజకవర్గంలో తాను ఇప్పటివరకు దాదాపు 4500 గడపలకు పైగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లానని ఏ ఒక్క ఇంట్లో కూడా అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాలేదని చెప్పిన వారు లేరని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.
ఇబ్రహీంపట్నం మండలం కాచవరం (దొనబండ) సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వం నుంచి చేకూరిన లబ్దిని గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సాంకేతిక కారణాలు మినహాయిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తునట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి తక్షణ అవసరాల నిమిత్తం ప్రజలు చేస్తున్న విజ్ఞప్తులను అప్పటికప్పుడే పరిష్కరించేందుకు నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు.
ప్రజలకు మంచి చేస్తున్నాము కాబట్టే అధికారంలో ఉన్నప్పటికీ ధైర్యంగా ప్రజల ముంగిటకి వెళ్లి వారికి సంక్షేమ పథకాల వల్ల చేకూరిన లబ్ది గురించి తెలియజేస్తున్నామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఎన్నికల ముందు కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, వర్గం చూడం అర్హత ప్రామాణికమంటూ చెప్పారని, నేడు ఏపీలో అదే విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం తెలిపారు.