చిన్నతనంలో స్నేహితులతో కలిసి సరదాగా రాకెట్ పట్టిన ఆ చిన్నారి… పదేండ్లు వచ్చేసరికి టెన్నిస్ నే కెరీర్ గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. టెన్నిస్ లో శిక్షణ ప్రారంభించిన ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదుగుతూ, భారత జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. ఆ అమ్మాయి ఖమ్మం కు చెందిన యామలపల్లి సహజ.
సహజ తల్లిదండ్రులు యామలపల్లి భవానీప్రసాద్- సుప్రియలు. ఖమ్మం వాస్తవ్యులైన వీరు, హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగ నిమిత్తం మకాం హైదరాబాద్ కు మార్చారు. సహజ పదో తరగతి వరకు హైదరాబాద్ లోని విజ్ఞాన్ స్కూల్లో, ఇంటర్ సిద్దార్థ్ జూనియర్ కళాశాలలో చదివారు. పదో ఏట నుండే టెన్నిస్ శిక్షణ ప్రారంభించిన సహజ ఇంటర్ తర్వాత ఇండియా నేషనల్ ర్యాంకింగులో 20వ స్థానం పొందారు. స్పోర్ట్స్ కోటాలో వంద శాతం స్కాలర్ షిప్ తో అమెరికాలో డిగ్రీ చదువుటకు అర్హత పొంది, టెక్సాస్ లోని సామ్ హోస్టెన్ స్టేట్ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషన్ లో డిగ్రీని పూర్తి చేశారు. సహజలో టెన్నిస్ పై ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి భవానీప్రసాద్, ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం వదులుకొని, పూర్తి స్థాయిలో తన కుమార్తె కెరీర్ పై దృష్టి పెట్టారు. డిగ్రీ పిదప స్వదేశానికి చేరుకున్న సహజ టెన్నిస్ పై పూర్తి దృష్టి పెట్టారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సహజ మొదట టెన్నిస్ శిక్షణ కు ఖర్చు భరించలేక వేయి రూపాయల ఫీజుతో, యూ ట్యూబ్ చూస్తూ, టెన్నిస్ శిక్షణ పొందారు.
గత రెండు సంవత్సరాలుగా బెంగుళూరు పిబిఐ అకాడమీలో కోచ్ సీజర్ మొరాల్స్ వద్ద శిక్షణ పొందుతున్నారు. 2021 సంవత్సరంలో ప్రపంచ ర్యాంకింగులో 1300 స్థానంలో ఉన్న సహజ, రెండేళ్ల శిక్షణ లో రాటుదేలి, తన ర్యాంకింగును మెరుగుపర్చుకొని, ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగులో 306, నేషనల్ ర్యాంకింగులో నెంబర్ 2, తెలంగాణా ర్యాంకింగులో నెంబర్ 1 గా వున్నారు. టెన్నిస్ కెరీర్ లో కళాశాల స్థాయిలో 2017 నుండి 2021 వరకు మూడు సార్లు సౌత్ ల్యాండ్ కాన్ఫరెన్స్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్ గా, టెక్సాస్ రీజియన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ గా 18వ ర్యాంక్, ఐటిఏ/ఎన్ సిఏఏ నేషనల్ ర్యాంకింగ్ సాధించిన మొదటి ప్లేయర్ గా చరిత్రలో నిలిచారు.
ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడలో సహజ రాణిస్తున్నారు. ఐటీఎఫ్ 2023 టైటిల్, ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్స్ (2021-2022) సాధించారు. వచ్చే నెలలో చైనాలో జరిగే బిలీజియన్ కింగ్ కప్ ప్రపంచ స్థాయి పోటీలకు భారత్/తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించనున్నారు.
టెన్నిస్ క్రీడ సంపన్నుల క్రీడ. శిక్షణ చాలా ఖర్చుతో కూడుకున్నది. సంవత్సరానికి కనీసం 30 లక్షలు ఖర్చు అగుతుంది. మధ్య తరగతికి చెందిన సహజ లో నైపుణ్యం, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక వనరుల అవసరం ఎక్కువగా వుంది. అంతర్జాతీయ టోర్నీలు ఆడడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఇబ్బంది వల్లే, ఆరంభంలో సహజ ఎక్కువ టోర్నీల్లో ఆడలేకపోయారు. స్పాన్సర్లు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్థిక అండ లభిస్తే, మెరుగైన ఫలితాలు సాధిస్తాననే నమ్మకం సహజ లో ఉంది. స్పాన్సర్లు ముందుకు వచ్చి, సహజ కు అండగా నిలబడితే మన ఖమ్మం, తెలంగాణ నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఈ ఆణిముత్యం అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ రంగాన్ని శాసిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.