చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల భేటీ
తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారవ్వడంతో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎవరెక్కడ పోటీ చేయాలన్న దానిపై నేడు మూడు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న చంద్రబాబు పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు.
సీట్ల సర్దుబాటుపై చర్చించి రెండు రోజుల్లో మలి జాబితా అభ్యర్థుల ప్రకటన చేసేలా చంద్రబాబు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు అంశంపై పార్టీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న అంశం త్వరలో కొలిక్కి తెచ్చేందుకు మూడు పార్టీలు కసరత్తును వేగవంతం చేశాయి. ప్రస్తుతం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు.
కేంద్ర మంత్రి షెకావత్, జయంత్ పాండా, శివ ప్రకాష్, పురందేశ్వరి, తదితర బీజేపీ నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి చంద్రబాబు నివాసానికి వచ్చారు. జనసేన తరఫున పవన్ కల్యాణ్ (పవన్ కళ్యాణ్), నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. సీట్ల సర్దుబాటుపై ఈ రోజు మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.
కాగా తెలుగుదేశం – జనసేన- బీజేపీ పొత్తుతో సీఎం జగన్‌కు వణుకు మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. వైసీపీ సిద్ధం సభకు జనాదరణ కరవైందని, అందుకే గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్‌తో మాయ చేస్తున్నారని విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన శంఖారావం సభలో పాల్గొన్న లోకేశ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. యువతకు, ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిడదవోలు నుంచి కందుల: జనసేన తరఫున పోటీ చేసే మరో అభ్యర్థి పేరును జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నుంచి జనసేన తరపున పోటీ చేయటానికి కందుల దుర్గేష్ పేరును ఖరారు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా కందుల దుర్గేష్ పార్టీలో కీలకంగా ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా రాజమండ్రి రూరల్ సీటును కందుల దుర్గేష్ ఆశించారు.అయితే తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆ స్థానంలో ఉండటంతో దుర్గేష్‌కు న్యాయం చేస్తామని కొద్దిరోజుల క్రితం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో కందుల దుర్గేష్‌కు నిడదవోలు సీటు కేటాయిస్తూ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఇందులో ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా కందుల దుర్గేష్ పేరు ప్రకటనతో మిగిలిన స్థానాలు అభ్యర్థులపై త్వరలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP