ముషీరాబాద్: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో జీహెచ్ఎంసీ అధికారులు ఇళ్లను కూల్చివేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో కొందరు దళితులు దాదాపు 70 ఏళ్లుగా చిన్నపాటి ఇళ్లను నిర్మించుకొని ఉంటున్నారు. ఉదయం ఎమ్మార్వో, అధికారులు తమ సిబ్బందితో వచ్చి ఇళ్లను కూల్చివేస్తుండగా వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. రెవెన్యూ అధికారులు బలవంతంగా పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చి వేస్తున్నారని ఆరోపించారు.
బాధితులకు ధరణి విచారణ కమిటీ ఛైర్మన్ కోదండ రెడ్డి మద్దతు తెలిపారు. ఘటనాస్థలానికి వచ్చిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కార్పొరేటర్ సుప్రియ భర్త నవీన్, భాజపా నేతలను అరెస్టు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు బాధితులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇళ్ల కూల్చివేత కొనసాగడంతో, స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.