కరీంనగర్ జిల్లా:
కుక్కల దాడిలో కోడి చనిపోవడంతో దాన్ని మున్సిపల్ కమిషనర్ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి నిరసన వ్యక్తం చేశాడో వ్యక్తి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణానికి చెందిన యువకుడు.
అజీజొద్దీన్ తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతూ కోడి కళేబరంతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. గమనించిన కమిషనర్ వేణుమాధవ్, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీంతో అజీజొద్దీన్ చేసేదేమీలేక కోడిని కమిషనర్ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి కొత్తపల్లి పట్టణ ప్రజల వాట్సాప్ గ్రూప్‌లో ఓ ఆడియోను విడుదల చేశారు.
గత మూడున్నరేండ్లుగా కొత్తపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కనీసం వీధి కుక్కల నుంచి ప్రజలను, కోళ్లను కాపాడాలని గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు అని బాధితుడు వాపోయాడు.
నా ఇంట్లోకి కుక్కలు చొరబడి కోడిని చంపేశాయి. ఒక వేళ పిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉండేది? మీరే ఆలోచించుకోవాలి’ అంటూ ఆడియోలో పేర్కొన్నారు. ఆఫీసు గుమ్మానికి కోడిని వేలాడదీయడంపై కమిషనర్ వేణుమాధవ్ కరీంనగర్ సీపీతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కుక్కల దాడిలోనే కోడి చనిపోయిందా? లేదా? అనే విషయమై విచారణ జరిపిస్తామని తెలిపారు…