బండ మైసమ్మ నగర్ వాసుల బాధలు అన్నీ తీర్చిన… నన్ను గెలిపించే బాధ్యత మీదేనని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన బన్సీలాల్ పేట డివిజన్ BJR నగర్, ముస్లీం బస్తీ, బండ మైసమ్మ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రచారంలో ప్రజలు నీరాజనాలు పలికారు.ప్రతి ఇంటి వద్ద మంత్రికి శాలువాలు కప్పి మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ముస్లిం బస్తీలో మహిళలు మంత్రిని ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించారు.
తమ బస్తీలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి మా కష్టాలు తొలగించిన కారు గుర్తుకే తమ ఓటు అంటూ ముక్తకంఠంతో ప్రకటించారు. తమ బస్తీలో BRS కు తప్ప ఇతర పార్టీలకు చోటు లేదని నినాదాలు చేశారు. అదేవిధంగా బన్సీలాల్ పేట D క్లాస్ లో, JNNURM ఇండ్ల వద్ద మహిళలు, స్థానిక ప్రజలు సాదర స్వాగతం పలికారు. బండ మైసమ్మ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఇండ్ల పై నుండి మంత్రిపై పూల వర్షం కురిపించారు. ముందుగా స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి కూపాల లాంటి ఇరుకైన ఇండ్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుండటం చూసి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా నిర్మించినట్లు చెప్పారు. స్థానిక ప్రజల కోరిక మేరకు CC కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ను కూడా నిర్మిస్తామని అన్నారు. బస్తీ దవాఖానా ఏర్పాటుకు కూడాచర్యలు తీసుకుంటామని చెప్పారు. JNNURM ఇండ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, త్వరలోనే పనులు చేపడతారని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేద, మధ్య తరగతి ప్రజలకు పంపిణీ చేసిందని చెప్పారు. అదేవిధంగా ఇండ్లు లేని పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి 70 వేల ఇండ్లను అర్హులకు పంపిణీ చేశామని, మరో లక్ష ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు.కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఆ ఇండ్లు కనిపించకపోవడం విచారకరం అన్నారు. తిరిగి BRS ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 రూపాయల కే గ్యాస్ సిలెండర్, రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా 15 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. కొందరు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తారని, తాను మాత్రం నిత్యం ప్రజలలోనే ఉంటాననే విషయం అందరికి తెలుసు అన్నారు. నిత్యం మీ మధ్యనే ఉంటూ మీకు ఏ అవసరం ఉన్నా అండగా నిలుస్తున్నానని గుర్తు చేశారు. మీ సమస్యలు అన్ని పరిష్కరించి అభివృద్ధి కి ఎంతో కృషి చేసిన తనను కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంత్రి వెంట ప్రచారంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, డివిజన్ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ప్రేమ్, లక్ష్మీపతి, బలరాం, KM కృష్ణ, రమణ, ఫహీం, అబ్బాస్, రజాక్, కుమార్ యాదవ్, జ్ఞాని, కమల్ కుమార్, సాయి, రాజేందర్, లంక రాజు, నాగభూషణం తదితరులు ఉన్నారు.