అమరావతి మండలం మండెపూడిలో మన కోసం శంకరన్న గ్రామసభ
ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కరించాలనే లక్ష్యంగా మన కోసం శంకరన్న పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. అమరావతి మండలం మండెపూడి గ్రామంలో మన కోసం శంకరన్న కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు వివిధ సందర్భంగా మండెపూడి గ్రామప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి. ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అన్న విషయాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అందడం లేదని వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించినట్టు తెలిపారు. తన దృష్టికి వచ్చిన సమస్యల్లో దాదాపు 90 శాతానికి పైగా ఇప్పటికే పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిని టైమ్ టార్గెట్ పెట్టుకొని పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్సీ కాలనీ స్మశాన వాటిక దగ్గర త్వరలోనే కల్వర్టు నిర్మిస్తామన్నారు. శివాలయం దగ్గరపూపులైన్ సమస్యను ఉపాధి హామీ పనుల ద్వారా పరిష్కరిస్తామన్నారు.
ఎస్సీ కాలనీలో విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ ఫార్మర్ సమస్యను అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండెపూడి నుంచి పరస వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.1.5 కోట్లు మంజూరయ్యాయని.. టెండర్ ప్రక్రియ కూడా పూర్తైందని తెలిపారు. త్వరలోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు తాను ఎప్పుడూ ముందుంటానన్నారు. సంక్షేమ పథకాల విషయంలో కానీ, గ్రామాల్లో సమస్యలు కానీ తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేస్తానన్నారు.