ఉమా మహేశ్వరి మరణంపై చంద్రబాబు భావోద్వేగ ట్వీట్
వార్త విన్నంతనే కుటుంబంతో కలిసి ఉమా మహేశ్వరి ఇంటికెళ్లిన చంద్రబాబు
ఆమె హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్
ఎన్టీఆర్ క్రమశిక్షణను ఆమె పుణికిపుచ్చుకున్నారని నివాళి
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి మృతిపై ఆ పార్టీ అధినేత, ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగభరిత ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
అనారోగ్యం, మానసిక ఒత్తిడి నేపథ్యంలో ఉమా మహేశ్వరి సోమవారం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లోని తన ఇంటిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ వార్త విన్నంతనే తన భార్య, కుమారుడు, కోడలుతో కలిసి ఉమా మహేశ్వరి నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సదరు ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ మధ్యనే కుటుంబ సభ్యులందరం కలుసుకుని ఆనందంగా గడిపామని గుర్తు చేసుకున్న చంద్రబాబు… ఇంతలోనే ఇంతటి విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరమని భావోద్వేగానికి లోనయ్యారు.
ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారని చంద్రబాబు తెలిపారు.
ఉమా మహేశ్వరి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన సంతాపం తెలిపారు.