విద్యార్థుల భద్రతపై రవాణాశాఖకు వినతి

Sakshitha news

విద్యార్థుల భద్రతపై రవాణాశాఖకు వినతి

స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలపై సమగ్ర తనిఖీలు చేపట్టాలి

ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్యూరో, సాక్షిత):

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సూర్యాపేట జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఇతర విద్యార్థుల రవాణా వాహనాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ లంబాడి విద్యార్థి సేన నాయకులు సూర్యాపేట జిల్లా రవాణా అధికారి ఎం.పురుషోత్తం రెడ్డితో పాటు రవాణాశాఖ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను తరలించే వాహనాలకు ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పీయూసీ తదితర పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా తనిఖీ చేయాలని కోరారు. వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం, చిన్నారులను సరైన అటెండర్లు లేకుండా తరలించడం, శిక్షణ మరియు అర్హతలు లేని డ్రైవర్లతో వాహనాలు నడపడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.


అలాగే స్కూల్ బస్సులు, వ్యాన్లలో బ్రేకులు, టైర్లు, స్టీరింగ్, లైట్లు, ఇండికేటర్లు, మిర్రర్లు, డోర్ లాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, కిటికీలకు రక్షణ గ్రిల్స్ లేదా మెష్, జీపీఎస్, సీసీ కెమెరాలు తదితర భద్రతా ఏర్పాట్లను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాలని కోరారు. పత్రాల్లో ఫిట్‌నెస్ ఉన్నట్లు చూపించడం మాత్రమే కాకుండా వాహనం వాస్తవ పరిస్థితిని కూడా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు.
విద్యాసంస్థలకు చెందిన వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లంబాడి విద్యార్థి సేన నాయకులు కోరారు. విద్యార్థుల ప్రాణ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో రవాణాశాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బానోత్ హరీష్ నాయక్, ఉపాధ్యక్షుడు లకావత్ వీరన్న నాయక్, రాష్ట్ర నాయకుడు రవి నాయక్, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.