ప్రజలకు మర్యాదే పోలీసింగ్‌కు మానవత్వం… నాణ్యమైన దర్యాప్తుతో న్యాయం అందించాలి…
— సీపీ అంబర్ కిషోర్ ఝా..
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, ప్రజలతో మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించడం ప్రతి పోలీసు అధికారికి ప్రధాన బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్‌లోని తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ దేవయ్య పుష్పగుచ్ఛం అందించి సీపీకి స్వాగతం పలికారు. అనంతరం డీసీపీ నేతృత్వంలో పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.
తనిఖీల సందర్భంగా సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసులను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా సందర్శిస్తూ పనితీరును సమీక్షించాలని సూచించారు. భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను నిష్పాక్షికంగా విచారించి చట్టబద్ధంగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర బలప్రయోగానికి తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అవసరమైన మేరకే చట్టబద్ధమైన బలాన్ని వినియోగించాలని తెలిపారు.
నేరాల నియంత్రణ కోసం రాత్రివేళల్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. సమస్యలు తలెత్తకముందే గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆధునిక పోలీసింగ్‌లో సీసీటీఎన్‌ఎస్, సమాచార సాంకేతికత వినియోగంపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సీపీ పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఫిర్యాదుదారులతో మర్యాదగా, ఓర్పుతో వ్యవహరిస్తూ చట్ట పరిధిలో సాధ్యమైనంత సహాయం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయడమే ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత అని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
