తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి….
అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: ఆర్డీఓ గంగయ్య….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జరగనున్న నేపథ్యంలో ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతీయ పతాకావిష్కరణ, పరేడ్ గ్రౌండ్ సిద్ధం, వేదిక నిర్మాణం, అతిథుల సీటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలను ముందస్తుగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రోటోకాల్‌కు అనుగుణంగా అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమ ప్రాంగణంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఆహ్వాన పత్రికలు ప్రోటోకాల్ ప్రకారం అందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పెద్దపల్లి పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మెప్మా అధికారులను ఆదేశించారు. ముఖ్య అతిథి ప్రసంగానికి అవసరమైన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఈ నెల 29వ తేదీ సాయంత్రంలోపు సమర్పించాలని పేర్కొన్నారు. గౌరవ వందనం, భద్రతా బందోబస్తు, ఇతర నిర్వహణ ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఏసీపీ జి. కృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, సి విభాగం సూపరింటెండెంట్ కుమారస్వామి, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసీల్దార్ రాజయ్య, జిల్లా స్థాయి అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
