సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లి మరింత ఆర్ధిక సాయం అందిస్తాం
ప్రభుత్వం పరంగా అండగా ఉంటుందని ఎంపీ మోపిదేవి హామీ
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో పదో తరగతి బాలుడిపై పెట్రోల్ పోసి చంపిన ఘటనపై రాజ్యసభ ఎంపీ, రేపల్లె నియోజకవర్గ ఇంఛార్జి మెపిదేవి వెంకటరమణారావు స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు. ప్రభుత్వం తరపు నుంచి రూ.లక్ష సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు దుర్మాగుల చేతిలో 15 ఏళ్ల వయసుకే బాలుడు మృతి చెందాడని.. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఇప్పటికే ఘటనకు పాల్పడిన నిందితులు మొత్తం నలుగురని పోలీసులు తేల్చారని.. అందులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు ఎంపీ మోపిదేవి మీడియాకు వివరించారు.
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కచ్చితంగా జరిగిన ఘటనను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ తరపున మరింత ఆర్థిక సాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తమ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు ఘటనలను ఉపేక్షించదని స్పష్టం చేశారు. పోలీసులు కూడా ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.