సఫాయి కార్మికుల కాళ్లు కడగడం కాదు కడుపు నింపే విధానం కావాలి..
సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్
ఈరోజు మంథని మునిసిపాలిటీ ఆవరణలో మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ… అనేక సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం పరిసరాల పరిశుభ్రత కోసం అనేక సమస్యలు ఎదుర్కొంటూ చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని అన్నారు.
కరోనా సమయంలో ప్రజల రక్షణ కొరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వహించిన ఘనత సఫాయి కార్మికులకే దక్కుతుందని అన్నారు.ఎమ్మెల్యే నుండి మొదలుకొని ప్రధాన మంత్రి వరకు సఫాయి కార్మికులను శాలువతో సత్కరించి కాళ్లు కడిగారని కార్మికులను సత్కరించినంత మాత్రాన వారి బ్రతుకులు మారయని కార్మికుల కాళ్లు కడగడం కాదు వారి కడుపు నింపే విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ మాసంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకుంటే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు గడిపల్లి మల్లేష్, చిప్పకుర్తి చందు,నాయకులు సింగారపు గట్టయ్య,ఎడ్లపెల్లి రాజయ్య,తదితర కార్మికులు పాల్గొన్నారు.