SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 21 at 3.49.08 PM

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై ఆగంతకుల కాల్పులు
• దళిత నేతపై కాల్పులకు నిరసనగా బిఆర్ఎస్ మద్దతు
• ఆజాద్ రావణ్ పై కాల్పులను ఖండించిన బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
• కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలి
• డబుల్ ఇంజిన్ సర్కారులో దళితులకు భద్రత కొరవడింది
• ఆజాద్ రావణ్ కు రక్షణ కల్పించాలి

బిజెపి ప్రభుత్వంలో, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశంలో గిరిజనులు, దళితుల పట్ల హింస రోజురోజుకు పెరుగుతోందని బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలపై అగ్రవర్ణాల దాష్టికం చెలరేగుతోందని ఆవేధన వ్యక్తం చేశారు.

మణిపూర్ లో గిరిజనులపై మారణహోమం కొనసాగుతుండగానే… ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో దళితులపై పట్టపగలు కాల్పులు జరుగుతుండడం అత్యంత దురదృష్టకరమన్నారు.

ఉత్తరప్రదేశ్ భీమ్ ఆర్మీ చీఫ్, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ప్రయాణిస్తుండగా మరో కారులో వచ్చిన ఆగంతకులు రెండు రోజుల కింద జరిపిన కాల్పుల సంఘటన ఇప్పుడు దేశమంతా దళితులు ఉలిక్కిపడేలా చేసిందని చెప్పారు.

సమాజంలోని అట్టడుగు వర్గాలు, తరతరాలుగా అణచివేతకు గురైన బలహీన దళితులు, గిరిజనులు సమాజంలో అందరికీ సమానంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసిఆర్ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు పెట్టి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు అమలు చేస్తూ, గిరిజనులకు కూడా గిరిజన బంధు ప్రకటించారని చెప్పారు. అయితే ఉత్తరప్రదేశ్ లో అగ్రవర్ణ దురహంకారం ఉన్న బిజెపి ప్రభుత్వం దళిత నేతపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.

నేడు పార్లమెంట్ ఆవరణలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ చేస్తున్న నిరసనకు బిఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతుందని వెల్లడించారు.

దళిత నేతలపై జరుగుతున్న ఈ కాల్పులను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై జరిగే దాడులు, అరాచకాలు, అవమానాలను బిఆర్ఎస్ ఉపేక్షించదని, వారికి అండగా నిలుస్తుందని చెప్పారు.

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై కాల్పులు జరిపిన వారిని వెంటనే పట్టుకోవాలని, వారికి కఠిన శిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ కు భద్రత కల్పించాలని, ఆయనకు ఏం జరిగినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. దళితులపై ఇలాంటి దాడుల చేసే వారికి సరైన గుణపాఠం చెప్పే విధంగా బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు.

పార్లమెంట్ ఆవరణలో భీమ్ ఆర్మీ చీఫ్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు నేతగాని వెంకటేశ్, పి. రాములు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS